YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నీట్ లో క్వాలీఫై తెలుగోళ్లు 72 వేల మంది తుది ‘కీ’తో తెలుగు విద్యార్థులకు అన్యాయం

 నీట్  లో క్వాలీఫై  తెలుగోళ్లు 72 వేల మంది  తుది ‘కీ’తో తెలుగు విద్యార్థులకు అన్యాయం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ)-2019 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బుధవారం (జూన్ 5) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫలితాల్లో మొత్తం 56.27
శాతం ఉత్తీర్ణత నమోదైంది. నీట్ పరీక్షకు మొత్తం 14,10,754 మంది విద్యార్థులు హాజరుకాగా.. 7,97,042 మంది విద్యార్థులు (56.27 %) అర్హత సాధించారు. అయితే గతేడాది కంటే నీట్ ప్రశ్నపత్రం సులువుగా రావడంతో కటాఫ్‌ మార్కు కూడా పెరిగింది. గతేడాది జనరల్‌ విభాగంలో కటాఫ్‌ మార్కు 107 ఉండగా, ఈసారి 134కు పెరిగింది. అయితే ఫైనల్ 'కీ'లో చోటుచేసుకున్న మార్పుల వల్ల దక్షిణాది విద్యార్థులు 10 మార్కుల వరకు నష్టపోవాల్సి వచ్చిందని విద్యా నిపుణులు అంటున్నారు. ఈ ప్రభావం ర్యాంకులపై పడిందని స్పష్టం చేస్తున్నారు.
ఫలితాల్లో రాజస్థాన్‌కు చెందిన నళిన్ ఖండేల్‌వాల్ 720 మార్కులకు గాను 701 మార్కులతో 99.99 పర్సంటైల్‌తో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఇక రెండో
ర్యాంకులో ఢిల్లీకి చెందిన భావిక్ బన్సాల్, మూడో ర్యాంకులో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అక్షత్ కౌశిక్ నిలిచారు. ఇద్దరూ 700 మార్కులే సాధించారు. తెలంగాణ (హైదరాబాద్)కు చెందిన జి.మాధురీ రెడ్డి (695 మార్కులు) జాతీయ స్థాయిలో 7వ ర్యాంకుతోపాటు.. అమ్మాయిల్లో టాపర్‌గా నిలవడం విశేషం. ఏపీలోని కడప జిల్లాకు చెందిన ఖురేషీ అస్రా 16వ ర్యాంకులో రాష్ట్రం నుంచి టాపర్‌గా
నిలిచింది. మొత్తంగా టాప్-20లో ఐదుగురు అమ్మాయిలు ఉంటే.. అందులో ఇద్దరు తెలుగువారే కావడం మరో విశేషం.
✪ తెలుగు రాష్ట్రాల నుంచి 72,083 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో ఏపీ నుంచి 72.55 శాతంతో 39,039 మంది విద్యార్థులు, తెలంగాణ నుంచి 68.88 శాతంతో 33,044 మంది

విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
✪ తెలంగాణ నుంచి 7వ ర్యాంకర్ మాధురీరెడ్డితోపాటు భూపాలపల్లికి చెందిన కుశ్వంత్‌ 55వ ర్యాంకు, హైదరాబాద్‌కు చెందిన ఆరె అక్షయ్‌ 59వ ర్యాంకు, నీల వంశీకృష్ణ 65వ ర్యాంకు సాధించి

మొత్తంగా నలుగురు తొలి 100 ర్యాంకుల్లో స్థానాలను దక్కించుకున్నారు.
✪ ఏపీ నుంచి ఖురేషీ అస్రాతోపాటు విశాఖపట్నానికి చెందిన పి.భానుశివతేజ 40వ ర్యాంకు, కడపకు చెందిన సోదం శ్రీనందన్‌రెడ్డి 42, నెల్లూరుకు చెందిన జి.కృష్ణవంశీ 62వ ర్యాంకు, హర్షిత్‌

చౌదరికి 64వ ర్యాంకు, విశాఖపట్నానికి చెందిన శ్రీ శ్రేయు 78వ ర్యాంకు సాధించింది.
జూన్ 6న నీట్ ఫలితాలతోపాటు, ఫైనల్ కీని కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. అయితే ఫైనల్ కీపై తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మే

29న విడుదల చేసిన నీట్‌ ప్రిలిమినరీ ‘కీ’కి సంబంధించి కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను ఫైనల్ ‘కీ’లో మార్చారు. ప్రిలిమినరీ ‘కీ’లో ఇచ్చిన జవాబులే

సరైనవి కాగా.. ఫైనల్ ‘కీ’లో వీటిని మార్చడంతో దక్షిణాది విద్యార్థులు మార్కులు కోల్పోవాల్సి వచ్చిందని వారంటున్నారు. రెండు ప్రశ్నలకు కలిపి 8 మార్కులు, వాటికి మైనస్‌ మార్కులతో కలిపి

మొత్తం 10 మార్కులను విద్యార్థులు కోల్పోయారని అంటున్నారు.
ర్యాంకుల్లో కనిపించిన తేడా..
నీట్ ఫైనల్ ఆన్సర్ కీ ప్రభావంతో నీట్ ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులకు వచ్చిన ర్యాంకుల్లో భారీ తేడా కనిపించింది. గతేడాది జాతీయస్థాయి 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందినవారు నలుగురుంటే,

ఈసారి ఒకరే ఉన్నారు. అలాగే వందలోపు ర్యాంకులు వచ్చినవారు గతేడాది 16 మంది ఉంటే.. ఈసారి పదిలోపే పరిమితం కావాల్సి వచ్చింది. అలాగే గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు

మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే.. ఈసారి నాలుగు ర్యాంకులే వచ్చాయి.
నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సెంటైల్గా.. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో

ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
నీట్ (యూజీ)-2019 ద్వారా ప్రవేశాలు కల్పించే కోటాలు..
✪ ఆల్ ఇండియా కోటా సీట్లు
✪స్టేట్ గవర్నమెంట్ కోటా సీట్లు
✪ సెంట్రల్ ఇన్‌స్టిట్యూషన్స్/ యూనివర్సిటీలు/ డీమ్డ్ యూనివర్సిటీలు
✪ స్టేట్/ మేనేజ్‌మెంట్/ఎన్నారై కోటా (ప్రైవేట్ యూనివర్సీటీలు, ప్రైవేట్ మెడికల్/ డెంటల్ కళాశాలలు)
✪ కేంద్రం పరిధిలోని సీట్లు
మే 5న దేశవ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్(యూజీ) పరీక్ష నిర్వహించింది. ఒడిశాలో ఫణి తుపాను కారణంగా, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థులకు మే 20న నీట్ పరీక్ష నిర్వహించింది. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించింది. ఈ ఏడాది నీట్(యూజీ) పరీక్షకు దేశవ్యాప్తంగా 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా..
14,10,754 మంది హాజరయ్యారు. మే 29న నీట్ ప్రిలిమినరీ కీని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం తుది కీ, ఫలితాలను
వెల్లడించింది. నీట్‌ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను 'మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్
ఫ్యామిలీ వెల్ఫేర్' ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్
ఆధారంగానే ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది.

Related Posts