విజయనగరం : అడవిని నమ్ముకున్న ఆదివాసీలు తరచూ రోగాల బారిన పడుతుంటారు.. అడవిలో దొరికిందో, సంతల్లో కనిపించిందో తెచ్చుకొని తినడం తప్ప, పోషకాహారం అందే వీలులేని జీవితాలు వారివి.. సరైన పోషణ లేక ఏజెన్సీ వాసుల్లో ఎక్కువ మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అంటువ్యాధులకూ, అంతుబట్టని మహమ్మారులకు త్వరగా ఎర అవుతున్నారు. దీనికి పోషకాహార లోపమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే కుటుంబాల ప్రగతి బాగుంటుంది. తద్వారా సమాజ అభ్యున్నతికి దోహదమవుతుందని భావించి ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా గిరిజనులకు ఆహార బుట్ట పథకాన్ని అమలు చేసింది. నెలనెలా ఆరు రకాల పోషకాహార నిత్యావసర సరకులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మార్చి నెల నుంచి సరకుల కిట్టులను పంపిణీ చేస్తున్నారు. ఇది గిరిజన కుటుంబాలకు వరంగా పరిణమించింది.
ఆహార బుట్ట పథకం జిల్లాలోని పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లో మొత్తం 45,465 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 102 డీఆర్ డిపోల పరిధిలో మొత్తం 49,824 రేషన్ కార్డులు ఉండగా..వీటిలో 45,465 మందికి ఈ పథకం వర్తిస్తుంది. ఐటీడీఏ పర్యవేక్షణలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. మన్యం మండలాల్లో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) డిపోలు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోని చౌక ధరల దుకాణాల ద్వారా ఆహార బుట్ట పథకం సరకుల కిట్లు పంపిణీ చేస్తున్నారు.
అర్హులైన ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి ఆహార బుట్టలు అందించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా గోదాములు, డిపోలకు సరకులు చేరాయి. అయినప్పటికీ పూర్తిస్థాయిలో పంపిణీ మాత్రం జరగడంలేదు. ఆఫ్‌లైన్ ద్వారా నిర్వహించిన డిపోల్లో మాత్రమే సరకులు ఇప్పటివరకు అందించారు. ఈ-పాస్ అమలవుతున్న దుకాణాల్లో మాత్రం నేటికీ సరకులు పంపిణీ కాలేదు. ఇందుకు ప్రధానంగా ఈ-పాస్ యంత్రాల్లో సరకుల వివరాలు నమోదు కాలేదని, కొన్ని డిపోల్లో ఎస్సీలకు సైతం సరకులు రావడంతో ఎవరికి, ఎలా అందజేయాలో నిర్వాహకులతో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో కొన్ని డిపోల్లో సరకులు మూలకు చేరి దర్శనమిస్తున్నాయి. గిరిజనుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆహార భద్రత పథకం గిరిజనులకు వరంగా మారుతుంది. మన్యంలోని మారుమూల ప్రాంతాల్లో అనేకమంది పౌష్టికాహార లోపంతో బాదపడుతున్నారు. గుర్తించిన ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.532 విలువ చేసే మంచినూనె, శెనగ పలుకులు, గోదుమ పిండి, రాగిపిండి, కందిపప్పు, బెల్లం వంటి ఆరు రకాల సరకులు ఉచితంగా అందజేస్తుంది. ఇస్తున్న సరకులు నిరుపేద గిరిజన కుటుంబాలకు ఉపయోగపడుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.