YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దాహం..దాహం..

దాహం..దాహం..

ఏలూరు : జిల్లావాసులు దాహార్తితో అల్లాడుతున్నారు. ప్రస్తుత రోహిణీ కార్తెలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గొంతు తడారిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా అన్నిచోట్ల మంచినీటి అవస్థలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. కొన్ని చోట్లయితే నాలుగైదు రోజుల్లో అడుగంటే పరిస్థితికి చేరాయి. ఇంకొన్నిచోట్ల పసర్లతో దుర్వాసన వస్తున్నాయి. బిందెడు మంచినీరు దొరకాలంటేనే గగనంగా మారింది. మహిళలు మంచినీటి కోసం పడే ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మంచినీటి చెరువులు పూర్తిగా అడుగంటితే తాగునీటికి మరింత విషమ పరిస్థితులు ఎదురుకానున్నాయి. దీనికి తోడు కొన్ని కాలువలపై జరుగుతున్న పనుల వలన నీటీ విడుదల కొంత ఆలస్యం కానుంది. నరసాపురం ప్రధాన కాలువపై పెనుగొండ, సగంచెరువు గ్రామాల వద్ద ఆర్‌అండ్‌బీ శాఖ వంతెన పనుల నిమిత్తం కాలువలో అడ్డుకట్ట వేసింది. దీనిని తొలగిస్తేనేగానీ కాలువ నీరు దిగువకు రాదు. జలవనరులశాఖ అధికారులు ఇప్పటికే తొలగించాలని తాఖీదులిచ్చారు. ఈ పరిస్థితుల్లో కాలువలకు నీటిని వదిలిన వెంటనే అన్ని చెరువులకు చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. మరీ ముఖ్యంగా శివారు గ్రామీణ ప్రాంతాలకు నీరు చేరాలంటే ఆలస్యమే అవుతుంది. కాలువలో పూర్తిస్థాయిలో నీటి ప్రవాహం ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాల లభ్యత తక్కువగా ఉండడంతో కాలువలకు ఎంతమేర నీరు వస్తుందోననేది ఒకింత అనుమానం అధికారుల్లో తలెత్తుతోంది.
అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలతో ఎదురీదుతున్నారు. శివారు ప్రాంతాలకైతే చుక్కనీరందని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణాల్లో పరిస్థితి కొద్దిగా పైకి మెరుగుగా కనిపించిన క్షేత్రస్థాయిలో మాత్రం అవసరాలకు నీరందడంలేదు. సాధారణ రోజుల్లోనే తాగునీటి ఇబ్బందులు కనిపిస్తాయి. ప్రస్తుత వేసవిలో మరింత రెట్టింపయ్యాయి. మంచినీటి చెరువులపై ఆధారపడిన పట్టణాల్లో నీటి నిల్వలు రోజురోజుకు గణనీయంగా తగ్గుతూ విషమ పరిస్థితులు తలెత్తనున్నాయి. మంచినీటి కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తున్న పూర్తిస్థాయిలో మాత్రం పట్టణ ప్రజలకు నీరందడంలేదు. పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో రెండు పూటలా జరిగే మంచినీటి సరఫరా ప్రస్తుతం ఒకపూట మాత్రమే అందిస్తున్నారు. నీటి ఎద్దడి ప్రాంతాలతో పాటు నీరందని శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా అందిస్తున్న సరిపోవడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పాలకొల్లులో మంచినీటి చెరువుల్లో నీటి నిల్వలు మరో పదిరోజులు మాత్రమే దాహార్తిని తీర్చగలవు. అది దాటితే ఇచ్చే ఒకపూట కూడా ఇవ్వలేని పరిస్థితి ఎదురవుతుంది.
పట్టణవాసులే కాకుండా గ్రామీణ ప్రాంతవాసులు తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. పేరుకే గోదావరి చెంతన ఉన్నా ప్రతి వేసవిలో దాహార్తితో ఇబ్బందులు మాత్రం తప్పడంలేదు. కొన్ని ప్రాంతాల్లో సక్రమంగా నీరందకపోవడం, మరికొన్ని ప్రాంతాలకు కలుషీత నీరు సరఫరా కావడం వంటి పరిస్థితుల మధ్య తాగునీటిని కొనుగోలు చేసుకోవల్సిన పరిస్థితి ప్రజలకు ఎదురవుతుంది. శుద్ధి జరిపిన నీటిని ప్రైవేటు వ్యాపారుల నుంచి లీటరు రూ. 2 నుంచి రూ. 3 వరకు వెచ్చించి మరీ కొనుగోలు చేసుకుంటున్నారు. రోజంతా దాహార్తి, వంట అవసరాలకు కావల్సిన నీటిని డబ్బాల ద్వారా కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకెళ్ళడం దాదాపు అందరికి ఆలవాటుగా మారిపోయింది. గ్రామాల్లో ఎన్టీఆర్‌ సుజల పథకం ద్వారా తాగునీరు అందిస్తామనే పథకం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చకపోవడంతో మంచినీటి ఇబ్బందులు తీరడంలేదు. ఇప్పటికే దాదాపు 300 గ్రామాల్లో ప్రధాన చెరువుల్లో నీరు అడుగంటి తాగేందుకు వీలులేని పరిస్థితికి చేరుకున్నాయి. మరికొన్ని చెరువులు మరో నాలుగైదు రోజుల్లో అడుగంటనున్నాయి. ప్రస్తుతం ఎండలు మండుతుండడంతో చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరు ఇంకిపోతుంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల ప్రజలు బిందెడు నీటికి అల్లాడిపోతున్నారు. కనీసం సమీప పట్టణాల నుంచి డబ్బాల ద్వారా తెచ్చుకుందామన్న అక్కడ ఇవే పరిస్థితులు దాపరించడంతో దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాడకపు అవసరాలకు అడుగంటిన చెరువులోని బురద నీరు ఉపయోగపడడం లేదంటున్నారు. కొన్ని గ్రామాల్లో కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న అంతంత మాత్రంగానే అందుతుందని గగ్గోలు పెడుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో భూగర్భ జలాలను తాగునీటి అవసరాలకు ఉపయోగించుకుంటున్న ప్రస్తుతం ఆ నీరు అందడంలేదు. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. నరసాపురం, పాలకొల్లు, ఉండి, చింతలపూడి, పోలవరం, దెందులూరు, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, ఉంగుటూరు, ఏలూరు తదితర నియోజకవర్గాల్లోని గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు రోజురోజుకు ముదురుతున్నాయి.

Related Posts