యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ప్రజావేదిక భవనాన్ని తనకు అధికారిక భవనంగా కేటాయించాలని కోరుతూ జగన్ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రాజకీయంగా చూడటం గర్హనీయమని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. చంద్రబాబు లేఖపై వైసీపీ జాతీయ ప్రధానకార్యదర్శి విజయసాయిరెడ్డి చేసిన ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలను యనమల ఖండించారు. విజయసాయిరెడ్డికి ధీటుగా సమాధానమిస్తూ యనమల ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం జగన్‌కు చంద్రబాబు మొదటి లేఖ ప్రజాసమస్యలపై ఉంటుందని అనుకున్నానని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. ఇది మొదటి లేఖ కాదనేది విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలి. గత నెల 30వ తేదీనే చంద్రబాబు మొదటి లేఖ రాశారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి అభినందనలు చెబుతూనే.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తామని చంద్రబాబు తన తొలి లేఖలోనే స్పష్టంగా చెప్పారు.అలాంటిది చంద్రబాబు తొలిలేఖలో ప్రజల సమస్యలను ప్రస్తావించలేదని విజయసాయి రెడ్డి పేర్కొనడం ఆయన అబద్ధాల చిట్టాలో చేరిన మరో కొత్త అబద్ధం. అబద్దాలు చెప్పిచెప్పి అలవాటైపోయి అధికారంలోకి వచ్చినా ఇంకా అబద్ధాలు చెప్పడాన్నే వైసీపీ నేతలు కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారపక్షం పాత్ర ఎంతో ప్రతిపక్షం పాత్ర అంతకన్నా అధికంగా ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా నారా చంద్రబాబు నాయుడి నివాసానికి సమీపానే ఉన్న ప్రజావేదిక ను, కార్యాలయ అవసరాలకు ఇవ్వాలని కోరడాన్ని కూడా తప్పు పట్టడం తగదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు వారి ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు ఇది దోహదపడుతుందనే చంద్రబాబు కోరారు. దీనిని కూడా రాజకీయంగా చూడటం, వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదన్నారు.విలాసవంతమైన భవనాలు రాష్ట్రంలో ఊరికొకటి చొప్పున ఎవరికి ఉన్నాయో ప్యాలెస్‌లను తలదన్నే ఆయా భవనాల గురించి అందరికి తెలిసిందే. అలాంటిది చంద్రబాబు ఏదో విలాస భవనంలో నివసిస్తున్నట్లుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం జగన్మోహన్‌రెడ్డి విలాస భవనాలను(బెంగళూరులోని ఎలహంక, లోటస్ పాండ్, పులివెందుల ప్యాలెస్ తాడేపల్లి భవనాలను) ప్రజలకు గుర్తు చేయడమే.విమర్శలు-ప్రతివిమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి తప్ప ఏదో ఉబుసుపోకకు చేసినట్లుగా ఉండకూడదు. మన వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికిగాని, ప్రజలకుగాని ఎంత ప్రయోజనం కలుగుతుందో ఆలోచించి చేయాలే తప్ప ఏదో మీడియాకు ఎక్కడమే ధ్యేయంగా విమర్శలు చేయరాదని యనమల హితవు పలికారు.