ఈనెల 8వతేదీ శనివారం ఉ.11.49గం.లకు అమరావతి సచివాలయ ప్రాంగణంలో జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.ఈమేరకు గురువారం అమరావతి సచివాలయంలో ఇందుకు సంబంధించి సిఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈవేడుకకు విచ్చేసే అత్యంత ప్రముఖులు,ప్రముఖులు,ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వారి కుటుంబ సభ్యులు, ఎంపి,ఎంఎల్సి తదితర ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు,ప్రజలు వారికి కేటాయించిన ప్రాంతాలకు సులభంగా చేరుకునేలా ఆయా మార్గాల గుండా సైనేజి బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు.ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి చేరుకునే రహదారుల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సిఎస్ ఆదేశించారు. ప్రమాణ స్వీకారోత్సవంపై ప్రచురించిన ఆహ్వాన పత్రికలకు వెనుకవైపున తెలుగులో రూట్ మ్యాప్ ను ముద్రించాలని తద్వారా ఆహ్వానితులు తదితరులు సులభంగా వేడుక ప్రాంగనానికి చేరుకునేందుకు వీలుంటుందని సిఎస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.
ఈప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసే అతిధులు,మీడియా సహా ప్రతి ఒక్కరికీ వారు కూర్చున్న ప్రాంతంలోనే తాగునీరు,అల్పాహారం వంటివి అందించాలని ఈఏర్పాట్ల ఈవిషయంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.బందోబస్తు ఏర్పాటు తాగునీరు,అల్పాహారం వంటివి అందించడంలో ఎంతమాత్రం రాజీపడవద్దని అదే సమయంలో అనవసర ఖర్చులకు తావీయకుండా అవసరమైన మేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధింత శాఖల అధికారులకు సిఎస్ స్పష్టం చేశారు.ఈవేడుకలకు విచ్చేసిన వారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని సక్రమంగా తిలకించేందుకు వీలుగా ప్రాగణంలో సరిపడిన మేరకు ఎల్ఇడి తెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా పెద్దఎత్తున సందర్శకులు సచివాలయం సందర్శనకు వస్తారని కావున సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో మరుగుదొడ్లు తదితర అన్నీపరిశుభ్రమంగా ఉండేలా చూడాలని సిఎస్ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు.ఇంకా మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఆయా శాఖలపరంగా తీసుకోవాల్సిన చర్యలు,ఏర్పాట్లను పటిష్టంగా చేయాలని సిఎస్ సుబ్రహ్మణ్యం ఆదేశించారు.
పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం విజయవంతంగా జరిగేలా విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.ఆహ్వాన పత్రికల వెనుకవైపు ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి ఏవిధంగా చేరుకోవాలనే దానిపై రూట్ మ్యాప్ ముద్రిస్తే అతిధులు తదితరులు సులభంగా ప్రాంగణాన్ని చేరుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక క్రమపద్ధతిలో సజావుగా జరిగేందుకు వీలుగా పోలీస్ శాఖ తరుపున తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని డిజిపి సవాంగ్ పేర్కొన్నారు.
రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా మాట్లాడుతూ 8వతేదీ ఉ.11.49గం.లకు రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమానికి సుమారు 5వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు.8వతేదీ ఉ.11గం.ల 49ని.లకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుండగా ఉ.11గం.ల 44 నిమి,లకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి, 11గం.ల 45 నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నర్సింహన్ వేడుక ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన తెలిపారు.ఈకార్యక్రమానికి సంబంధించి అవసరమైన వివిధ రకాల పాస్ లను ముద్రించి పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు.ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అతిధులు, మంత్రులు,ఇతర ప్రజా ప్రతినిధులు వారి కుటుంబ సభ్యులు,ఉన్నతాధికారులు తదితరులకు హైటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు.
9న ప్రధానమంత్రి నరేంద్ర మోది తిరుపతి పర్యటన ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష.
ఈనెల 9వతేదీన భారత ప్రధాని నరేంద్ర మోది తిరుపతి పర్యటన ఏర్పాట్లపై గురువారం అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వీడియో సమావేశం ద్వారా టిటిడి అధికారులు,చిత్తూర్ జిల్లా కలక్టర్ తదితరులతో సమీక్షించారు. 9వతేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోది తిరుపతి చేరుకుని తదుపరి తిరుమల వెళ్ళి శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నఅనంతంరం తిరిగి ఢిల్లీ వెళతారని సిఎస్ పేర్కొన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని టిటిడి,పోలీస్ తదితర శాఖల అధికారులను సిఎస్ ఆదేశించారు.
ఈసమావేశంలో అదనపు డిజిపిలు రవిశంకర్ అయ్యన్నార్,కుమార విశ్వజిత్,ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్,సిఆర్డిఏ కమీషనర్ డా.లక్ష్మీ నర్సింహ,ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,కృష్ణా జిల్లా కలక్టర్ ఇంతియాజ్,గుంటూర్ జిల్లా జెసి హిమాన్షు శుక్లా,ప్రోటోకాల్ విభాగ సంచాలకులు ప్రసన్న వెంకటేశ్,సమాచారశాఖ కమీషనర్ ఎస్.వెంకటేశ్వర్,మున్సిపల్ శాఖ కమీషనర్ శ్యామల రావు,ఐజి ఆర్కె మీనా, వైద్య ఆరోగ్యం,ఆర్అండ్ బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.