YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీహార్ లో వేడిక్కిన రాజకీయాలు

బీహార్ లో వేడిక్కిన రాజకీయాలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తిరిగి రాష్ట్రీయ జనతాదళ్ తో చేతులు కలుపుతారా? భారతీయ జనతా పార్టీకి దూరం అవుతారా? ఇదే చర్చ ప్రస్తుతం బీహార్ లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా జరుగుతుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నితీష్ కుమార్ బీజేపీని వదిలించుకుంటారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి జనతాదళ్ యు అధికారంలోకి రావాలంటే కటీఫ్ చెప్పడమే మేలని నితీష్ భావిస్తున్నారన్న వదంతులు బాగానే విన్పిస్తున్నాయి.కేంద్రమంత్రివర్గంలో తమకు పదవులు అడిగినన్ని ఇవ్వలేదని నితీష్ అలకబూనారన్నది వాస్తవమే. నితీష్ కుమార్ రెండు కేంద్రమంత్రి పదవులు అడిగితే బీజేపీ ఒక్కటి మాత్రమే ఇస్తామని చెప్పడంతో నితీష్ పార్టీ కేంద్రమంత్రివర్గంలో చేరలేదు. అయితే ఆ తర్వాత నితీష్ కుమార్ తాము ఎన్డీఏలోనే కొనసాగుతామని చెప్పారు. ప్రధాని మంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని బీహార్ వచ్చిన వెంటనే నితీష్ తాను కూడా మంత్రి వర్గ విస్తరణ చేసి బీజేపీని పక్కన పెట్టారు. ఇందుకు బీజేపీ కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు.అయితే నితీష‌ కుమార్ బీజేపీకి దూరం జరగాలని ప్రయత్నిస్తున్నట్లు హస్తినలో ప్రచారం బాగా జరుగుతోంది. ఇఫ్తార్ విందు కార్యక్రమాలను కూడా రెండు పార్టీలు వేర్వేరుగా నిర్వహించుకున్నాయి. ఒకరు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరొకరు హాజరు కాకపోవడంతో బీజేపీ, జేడీయూల బంధంపై పలు అనుమానాలు బయలుదేరాయి. దీనికి తోడు రాష్ట్రీయ
జనతాదళ్ మళ్లీ నితీష్ ను దగ్గరకు తీసుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా ఇందుకు దోహదం చేశాయి.కానీ నితీష్ కు అంత అవసరం ఏమొచ్చింది? ఇటీవలే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమి ఘన విజయం సాధించింది. ఈ కూటమిని ప్రజలు ఆహ్వానించారు. కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిని ప్రజలు తిరస్కరించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నిన్నటి ఎన్నికల్లో జనం జేడీయూ, బీజేపీకి పట్టం కట్టారు. మీసా భారతి, శతృఘ్నసిన్హా వంటి వారు ఈ ఎన్నికల్లో మట్టికరిచారు. మరో ఐదేళ్ల పాటు మోదీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంటుంది. ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్ బీజేపీని వదిలిపెట్టి వెళతారనుకోవడం అవివేకమంటున్నారు విశ్లేషకులు. మరోవైపు జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సయితం బీజేపీకి మద్దతు తెలిపే అవకాశాలు ఎక్కువ. ఇవన్నీ కేవలం వదంతులేనని, నితీష్ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ నుంచి బయటకు రారన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.

Related Posts