యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైసీపీఎల్పీ సమావేశం జరిగింది. తాడేపల్లిలో జరిగిన ఈ భేటీకి వైసీపీ శాసనసభ్యులు హాజరయ్యారు. సమావేశంలో మంత్రివర్గ కూర్పు.. అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. అలాగే పలు కీలక నిర్ణయాలను కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. అయితే సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావోద్వేగానికి గురయ్యారట. తనతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేసుకున్నారట. అధికారం లేకపోయినా.. ఈ తొమ్మిదేళ్లు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనతో పాటు ప్రయాణాన్ని కొనసాగించామని వ్యాఖ్యానించారట. ఎవరికీ అన్యాయం చేయను.. ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తానంటూ భరోసా ఇచ్చారట. ఎవరినీ విస్మరించను.. ఎవర్నీ వదులుకోనని చెప్పారట. అందరం కలిసి ఏపీ ప్రజలకు సేవ చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. జగన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా సీనియర్ నేతలు కూడా భావోద్వేగానికి గురయ్యారు.. కొందరు కన్నీటిపర్యంతమయ్యారట. మంత్రివర్గ కూర్పుపైనా పార్టీ సీనియర్ నేతలు జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సామాజిక న్యాయం విషయంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పారని.. జగన్ మాత్రం చెప్పిన ప్రకారం అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారన్నారు. తమ రాజకీయ జీవితంలో వైఎస్ జగన్‌లాంటి ముఖ్యమంత్రిని చూడలేదంటున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయాల్లో సంచలనమని అభిప్రాయపడుతున్నారు.