యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. అయితే, సైబర్ క్రైం పోలీసులకు ఆయన సహకరించలేదని తెలుస్తోంది. మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు.డిజిటల్ సంతకం ఫోర్జరీ చేసినట్లు అంగీకరించారు. ఫోర్జరీ చేసిన విధానం కూడా వివరించారు. కానీ, దేనికోసం ఫోర్జరీ చేశారన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఇక మూడో రోజు విచారణకు గురువారం ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు. నిన్న కూడా తీరు మారలేదు. రవిప్రకాశ్ పోలీసుల ప్రశ్నలకు స్పందించలేదు. పైగా విచారణ అధికారులను బెదిరించే యత్నం చేశారు. ‘నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఏదో ఒక రోజు మీకూ టైమ్ వస్తుంది’ అన్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.