YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

జూలై 30న విప్రో నుంచి వైదొలగనున్న అజీమ్

జూలై 30న విప్రో నుంచి వైదొలగనున్న అజీమ్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

విప్రోలో ఒక శకం ముగియనుంది. ఇండియన్ ఐటీ పరిశ్రమలో ఒక దిగ్గజం విశ్రాంతి తీసుకోబోతున్నారు. సౌమ్యుడు.. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం.. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలనే ఉన్నతమైన మనసు.. వంటి అంశాలు ఆయనను ప్రత్యేక స్థానంలో కూర్చొబెట్టాయి. ఆయన మరెవరో కాదు అజీమ్ ప్రేమ్‌జీ. ఇన్ఫోసిస్ ఎన్.ఆర్.నారాయణ మూర్తి, టీసీఎస్ ఎఫ్‌.సీ. కోహ్లి, విప్రో ప్రేమ్‌జీలను ఇండియన్ ఐటీ పరిశ్రమకు ఆద్యులుగా చెప్పుకుంటారు. 1945లో తండ్రి స్థాపించిన వంట నూనెల తయారీ కంపెనీని గ్లోబల్ ఐటీ కంపెనీగా తీర్చిదిద్దిన ఘనత ఈయనది. ఈ కంపెనీ విలువ ఇప్పుడు ఏకంగా రూ.1.8 లక్షల కోట్లు. దేశంలో మూడో అదిపెద్ద ఐటీ కంపెనీ. విప్రోను ఈ స్థాయికి తెచ్చిన ఆయన కంపెనీ చైర్మన్‌ బాధ్యతల నుంచి జూలై 30న వైదొలగనున్నారు. ఈయన వయసు 74 ఏళ్లు. వీప్రోలో 53 ఏళ్లపాటు సేవలందించారు. ప్రేమ్‌జీ స్థానాన్ని పెద్ద కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ భర్తీ చేయనున్నారు. 2007లో కంపెనీలో చేరారు. సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇప్పుడు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇకపోతే కంపెనీలో ప్రేమ్‌జీకి ఏకంగా 74.3 శాతం వాటా ఉంది.
రిటైర్మెంట్ వార్త నేపథ్యంలో అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ ఎదుగుదలకు దోహదపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇది నాకు చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ప్రయాణమని.. భవిష్యత్తులో దాతృత్వ కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని పేర్కొన్నారు.
దాతృత్వ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యం
అజీమ్ ప్రేమ్‌జీది గొప్ప మనసు. దాతృత్వ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. ఈ ఏడాది మార్చి నెలలో విప్రో సంస్థలోని తన వాటా షేర్లలో మరో 34 శాతాన్ని దాతృత్వానికి కేటాయించారు. వీటి విలువ రూ. 52 వేల కోట్ల పైమాటే. దీంతో ఆయన విరాళం మొత్తం రూ.1.45 లక్షల కోట్లకు (తన విప్రో షేర్లలో 67 శాతం) చేరడం గమనార్హం. ఈ మొత్తాన్ని ఆయన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నారు.
రూ.కోట్ల సంపద ఉన్నా సామాన్యుడిలా..
‘బిలియనీర్లలో ఒకరు. అయినా కూడా తన కారును తానే నడుపుకుంటూ ఆఫీస్‌కు వస్తారు. ఇతర ఉద్యోగుల మాదిరే క్యాంటిన్‌కు వచ్చి భోజనం చేస్తారు. ఆ సమయంలో ఆయనతో ఎవరైనా మాట్లాడొచ్చు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్థత్వం ఆయనది’ అని విప్రో ఉద్యోగి అజీమ్ ప్రేమ్‌జీ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
కంపెనీ ఎదుగుదల
✺ 1945 డిసెంబర్ 29న వంట నూనెల కంపెనీ స్థాపన. దీని పేరు వెస్ట్రన్ ఇండియా వెబిటబుల్ ప్రొడక్ట్స్. ప్రేమ్‌జీ తండ్రి మహమ్మద్ ప్రేమ్‌జీ ఈ కంపెనీని ప్రారంభించారు.
✺ మహమ్మద్ ప్రేమ్‌జీ మరణించిన తర్వాత 1966లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి తిరిగి వచ్చేశారు. అప్పుడు ఆయన వయసు 21 ఏళ్లు. తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు.
✺ 1982లో విప్రో కంపెనీ ఐటీ ప్రొడక్ట్స్ బిజినెస్‌లోకి ప్రవేశించింది.
✺ 2000లో విప్రో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ అయ్యింది. బీపీవో వ్యాపారంలోని అడుగు పెట్టింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ తర్వాత విప్రో మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ.
ఇకపోతే అజీమ్ ప్రేమ్‌జీ కంపెనీ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారు. ఎఫ్ఎంసీజీ కంపెనీ విప్రో ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్‌గా ఉంటారు. అలాగే విప్రో జీఈ హెల్త్‌కేర్‌లో చైర్మన్‌గా కొనసాగుతారు.

Related Posts