యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతలలో ఉన్న ఎస్ ఎస్ రావత్ నుండి మీనా సిటిసి అందుకున్నారు. పాలనా పరమైన బదిలీలలో భాగంగా ఇప్పటి వరకు ఎక్సైజ్ కమీషనర్గా, పర్యాటక, భాషా, సాంస్కృతిక, పురావస్తు, యువజనాభ్యుదయ, క్రీడా శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను ప్రభుత్వం అత్యంత కీలకమైన సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా మీనాను బదిలీ చేసిన ప్రభుత్వం, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఒకటి రెండు రోజుల్లో జరగనున్న మంత్రి వర్గ సమావేశం, తదుపరి జరగవలసిన శాసనసభ సమావేశాల నేపధ్యంలో ఎక్సైజ్ కమీషనర్గా గురువారం రిలీవ్ అయిన మీనా, ఒక రోజు వ్యవధిలోనే గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఛాంబర్లో సిటిసిపై (సర్టిఫికెట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్) సంతకం చేసి, అధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల అధికారులతో శాఖ తీరుతెన్నులపై చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ గంధం చంద్రుడు, ఎస్సి సంక్షేమ శాఖ సంచాలకులు హర్హ వర్ధన్ తదితరులు తదితరులతో పాటు సీనియర్ అధికారులు మీనాను కలిసిన వారిలో ఉన్నారు. 1998 బ్యాచ్కు చెందిన మీనా తన పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం, కర్నూలు కలెక్టర్, సిఎస్కు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్ధ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్ధ ఎండి, ఖనిజాభివృద్ది సంస్ధ ఎండి, రాష్ట్ర
విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలలో మీనా రాణించారు. తన పదవీ కాలంలో రెండు పర్యాయాలు ఎక్సైజ్ కమీషనర్గా పని చేసారు. ఈ
సందర్భంగా మీనా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంతో అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారని, సమర్ధవంతంగా పనిచేసి ప్రభుత్వ ప్రాధన్యత అవసరాల మేరకు వ్యవహరిస్తానని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వ్యవస్ధను నడపటంలో తాను ప్రతి ఒక్కరి సహకారాన్ని ఆశిస్తున్నానని స్పష్టం చేసారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో అబ్కారీ కమీషనర్గా విధులు నిర్వహించిన మీనా అత్యంత ప్రతిభావంతంగా వ్యవహరించారు. అక్రమ మధ్యానికి అడ్డుకట్ట వేస్తూ జాతీయ స్ధాయిలో ఖ్యాతి గడించారు. సమర్ధుడు, సౌమ్యునిగా పేరున్న ఆయనకు సిఎం అత్యంత కీలకమైన బాధ్యతలు ఇస్తారన్న ప్రచారం అక్షర సత్యం అయ్యింది, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సి, ఎస్టిల సంక్షేమం విషయంలో ఎంతో ప్రాధాన్యతను ఇస్తుండగా మీనాను ఈ రెండు శాఖలకు కార్యదర్శిగా పంపటం విస్రృత ప్రయోజనాల సాధన మేరకేనన్నది స్పష్టం అవుతోంది. పర్యాటక శాఖ కార్యదర్శిగా మీనా అధ్బుతాలు సృష్టించారనే చెప్పాలి. అంతర్జాతీయ స్ధాయిలో నిర్వహించిన పవర్ బోట్ రేసింగ్, బెలూన్ ఫెస్టివల్ వంటివి ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక పటంపై నిలిపాయి. ప్రసాద్, స్వదేశీ దర్శన్, సాగరమాల వంటి కేంద్ర ప్రభుత్వ పధకాల ద్వారా అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్కు నిధులు విడుదల చేయించిన ముఖేష్ కుమార్ మీనా, పనులను నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయించి కేంద్రం ప్రభుత్వ మన్ననలు పొందారు. అవాంతరాలను అధికమిస్తూ నవ్యాంధ్రను పర్యాటకాంధ్రగా రూపుదిద్దారు. ముఖేష్ కుమార్ మీనా పదవీ కాలంలో పర్యాటక రంగంలో రూ.5,300 కోట్లు పెట్టుబడులు తరలిరాగా, 25,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందారు. 2014 నాటికి రాష్ట్రంలో 6,700 మాత్రమే అతిధ్య గదులు ఉండగా ఆసంఖ్యను 14,600కు తీసుకు వెళ్లగలిగారు. పర్యాటక పాదముద్రల పరంగా దేశంలోనే 3వ స్ధానంలో ఎపి ఉండటం, అది 15 శాతం పెరగటం ఇలా మీనా తనదైన ముద్రను ఈ రెండెళ్లలో అంతర్జాతీయ సంస్ధలు, కేంద్రప్రభుత్వం నుండి 36 అవార్డులు పర్యాటక శాఖను వరించగా, వరుసగా రెండు సార్లు కేంద్రం నుండి సమీకృత పర్యాటక అభివృద్ది సాధించిన రాష్ట్రంగా ఎపిని నిలపటం చిన్న విషయం కాదు.