YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మామిడి కొనుగోలుదారులెక్కడ..

మామిడి కొనుగోలుదారులెక్కడ..

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

 ఈ ఏడాది మామిడి దిగుబడి చాలా తగ్గిపోయింది. మార్కెట్‌లోకి కూడా అంతగా వచ్చిన  పరిస్థితి లేదు. అయితే వచ్చిన అరకొర పళ్లు అధిక ధరలకు అమ్ముతున్నారంటూ వినియోగదారులు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. దీంతో మామిడి సాగు రైతులు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారు. గతేడాది వర్షాభావం, పొగమంచు కూడా పూత తగ్గిపోవడానికి కారణాలేనని రైతులు తెలుపుతున్నారు.వేసవికాలం వచ్చిందంటే అందరికీ నోరూరించే పళ్లలో ముఖ్యమైనది మామిడిపండు. అయితే ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పూత ఆశాజనకంగా లేకపోవడంతో కాయల దిగుబడి తగ్గింది. అనకాపల్లి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల మేర మామిడి తోటలను సాగు చేస్తున్నారు. తోటలకు దిక్కు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పిచికారి తదితర అవసరాలకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన దిగుబడి లేక మామిడి రైతులు దిగాలు పడ్డారు. అక్కడక్కడ తోటల్లోల కాయలు కాసినా, గాలులు, వర్షాలకు రాలి నష్టాలను మిగిల్చాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి కేంద్రంలో మామిడికాయలను కన్నూరుపాలెం కేంద్రంగా జార్ఘాట్‌, ఒరిస్సా, పశ్చిమబెంగాల్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉండేవి. ఎకరా తోటకు కౌలు రైతులు రూ.3వేలు చెల్లించి తోట వేసినప్పటికీ ఈ సీజన్‌లో పెట్టుబడి రాక తీవ్ర నష్టాలను చవి చూశారు. 25 కిలోల కేటు మామిడి కాయలు రూ.400 నుండి రూ.500కు విక్రయించినా నష్టాలను చూశామని రైతులు వాపోతున్నారు. చెట్టుమీద నుంచి కాయలు దించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా దించాల్సి ఉంటుందని, దించిన కాయలను ట్రాక్టర్లు, లారీలకు ఎక్కించడం, కూలీ పనులతో కలుపుకొని రూ.350 అవుతోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గిపోవడంతో మామిడిపళ్ల రేటు డజన్‌ రూ.200 నుంచి రూ.300 చిరు వ్యాపారులు అమ్మకాలు పెట్టగా అంతంత ధరలు పెట్టి కొనేవాళ్లు లేక వ్యాపారాలు బోసిపోయాయి. పట్టణంలో రైతు బజార్‌, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌, మెయిన్‌ రోడ్డులలో గిరాకీగా ఉండే మామిడిపళ్లు ఈ ఏడాది తినాలని అనిపించినా ధర చూసి బెంబేలెత్తిపోయేవారు అధికంగా ఉన్నారు.  మామిడిపళ్లు, ఇతర పళ్లను అమ్ముకొని బ్రతికే వారిపై ఈ ఏడాది భానుడి దెబ్బ గట్టిగానే తగిలిందని చెప్పాలి. ఎండ వేడిమి తట్టుకోలేక వ్యాపారులు అల్లాడిపోతున్నారు. అనకాపల్లిలో చిల్లర వ్యాపారులు 550 మంది వరకు ఉన్నారు. వీరంతా రైల్వే స్టేషన్‌, శారదానది రహదారి, బండిగాడి వీధి, కూరగాయల మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ప్రస్తుత వేసవిలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల నుండి 48 డిగ్రీల నమోదు అవుతుండడంతో వీరంతా ఎండ వేడిమి నుంచి ఉపసమనం పొందేందుకు దుప్పట్లు, డేరాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అధిక ఉష్ణోగ్రతలకు మామిడి, అరటి, ద్రాక్షా వంటి పండ్లు దెబ్బతిని అమ్మకాలు బాగా తగ్గిపోతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు.

Related Posts