YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం పాలసీ లెక్కేంటీ...

మద్యం పాలసీ లెక్కేంటీ...

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం పాలసీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి సవాల్‌గా మారనుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పాలసీ ద్వారా ఈ ప్రభుత్వానికి అంతకు మించి ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయంతోనే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. మరి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. మూడు దశల్లో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఆయన రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సంగతి పక్కన పెడితే జూన్ 30వ తేదీతో చంద్రబాబు ఇచ్చిన గడువుతో ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల గడువు ముగియనుంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వస్తుందని సిండికేట్లు కలలో కూడా ఊహించలేదు. దీంతో చాలా ధీమాగా ఉంటూ దుకాణాల్లో మద్యంను ఎమ్మార్పీ కంటే తమకు నచ్చిన ధరలకు విక్రయించేశారు. అయితే కొత్త ప్రభుత్వం రావడంతో ఊహించని పరిణామాలు సిండికేట్లలో ఏర్పడ్డాయి. కాగా ప్రస్తుతం ఉన్న పాలసీని ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగిస్తారా లేక కొత్త పాలసీని తీసుకువస్తారా అనే అంశం సిండికేట్లలో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. 2014లో నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు పాత పాలసీని కొనసాగిస్తూ ఏడాది కాలానికి మద్యం దుకాణాల వేలం పాటలు నిర్వహించారు. ఆ తర్వాత రెండేళ్లు, మరోసారి రెండేళ్ల గడువుకు వేలం పాటలను నిర్వహించారు. ఆ విధంగా రాష్ట్రంలోని 4400 మద్యం దుకాణాలు, 819 బార్లకు వేలం పాటలు నిర్వహించారు. కొత్త సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలి. కాగా ప్రస్తుతం ఉన్న దుకాణాలకు వేలం పాటలు నిర్వహించి ఏడాది కాలం పాటు గడువు ఇస్తారని మద్యం దుకాణదారులు భావిస్తున్నారు. ఈ ఏడాది లోపు కొత్త నిర్ణయాలు తీసుకుంటే ఆ తర్వాత నుంచి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించిన నందమూరి తారకరామారావు మద్యపాన నిషేధం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో ఏడాదిన్నర పాటు ఆ నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇది సాధ్యం కాదని ఒక సున్నితమైన వివరణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చి మద్యం అమ్మకాలను ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేశారు. పైగా అప్పుడు ఇటువంటి సంక్షేమ పథకాలు ఏమీ లేవు. మహా అయితే కిలో రూ.2కి బియ్యం మాత్రమే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ప్రకటించిన పథకాలన్నీ ఆల్ ఫ్రీగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీసుకునే ప్రతీ నిర్ణయం కీలకంగా మారనుంది. పైగా 2024 ఎన్నికలకు మద్యపాన నిషేధం అమలుచేసి వెళ్తామని ప్రకటించడం విశేషం.

Related Posts