యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
పార్టీ అధ్యక్షుడు పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ఒకే ఒక్క ఎమ్యెల్యేతో చివరకు సరిపెట్టుకోవాలిసి వచ్చింది. దాంతో జనసైనికుల్లో వచ్చిన నైరాశ్యం అంతా ఇంతా కాదు. మరీ ఇంత ఘోరంగా దెబ్బతింటామని భావించని జనసేనాని సైతం షాక్ నుంచి తేరుకోవడానికి పదిరోజులు పైనే సమయం పట్టింది. కిం కర్తవ్యం ? మధ్యలో కాడి వదిలి వెళిపోతే అన్నయ్య మెగాస్టార్ కన్నా దారుణంగా తనను నమ్ముకున్నవారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. దాంతో వెనక్కి వెళ్ళే కన్నా ముందుకే జనసేనాని అడుగు వేయాలని నిర్ణయించారు. ముందుగా తనవెనుక ఇంకా ఎవరు వుంటారు ? ఎందరు వస్తారు అనే అంచనాలతో రోజుకు నాలుగు జిల్లాల చొప్పున నాలుగు రోజులపాటు సమీక్షలు బిగిన్ చేశారు పవన్.
వచ్చే స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ గ్రామ స్థాయినుంచి పటిష్టం కావడానికి అవకాశం దొరుకుతుంది. నిరాశ నుంచి బయటకు వద్దాం. ప్రజాక్షేత్రంలో నిరంతరం వుంటూ పోయిన చోటే వెతుక్కుందాం అని పిలుపునిస్తున్నారు జనసేన అధ్యక్షుడు. పార్టీకి సీట్లు రాకపోయినా 16 లక్షలమంది ఓట్లు వేశారని నాలుగేళ్ళ పార్టీకి అన్ని ఓట్లు వస్తే రాబోయే రోజుల్లో మరింత ఆదరణ లభిస్తుందని అధినేత ధైర్యం నూరిపోస్తున్నారు. గెలుపు ఓటములు లెక్కల్లోకి తీసుకోకూడదని 2024 లక్ష్యంగా చేసుకుని పని మొదలు పెట్టాలని సైన్యానికి పవన్ ఇస్తున్న సందేశాలు హుషారును ఇస్తున్నాయి.నిత్యం ప్రజల్లో వుంటూ ప్రజా సమస్యలపై పోరాటం అని పవన్ పిలుపు నివ్వడం వరకు బాగానే ఉన్నా వచ్చే ఐదేళ్ళు ఖర్చు ఎవరు పెడతారనే ప్రశ్న క్యాడర్ లో వస్తుంది. టికెటదక్కించుకున్న నేతలు పూర్తిగా కొనసాగుతారా ? లేక అధికార పార్టీ వైపుకో కేంద్రంలో బిజెపి ఉన్నందున ఆ పార్టీలోకో మారతారో ఇప్పుడే తేలేలా లేదు. ఈ నేపథ్యంలో పవన్ ఇచ్చిన పిలుపు ఆయన ఫ్యాన్స్ మాత్రం మొయ్యక తప్పేలా లేదు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తాజా ప్రయాణంలో నిన్న మొన్నటిదాకా వున్న కమ్యూనిస్ట్ లు ఆయనతో జతకడతారో లేదో చూడాలి.