YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమ్మో ఉక్కపోత...

అమ్మో  ఉక్కపోత...

విజయవాడ: కొత్తాసుపత్రిలో ఎండ వేడికి రోగులు అల్లాడుతున్నారు. ఆసుపత్రిలో ఏసీలు ఉన్నా.. వాటిలో చాలావరకూ ప్రస్తుతం పనిచేయడం లేదు. రూ.లక్షలు ఖర్చు పెట్టి మరీ కొనుగోలు చేసిన ఏసీలకు సరైన నిర్వహణ లేకపోవడంతో.. అవి ఐదారు నెలలకే మూలకు చేరే పరిస్థితి తలెత్తుతోంది. ఆసుపత్రిలోని అన్ని బ్లాకుల్లో, గదుల్లో ఏసీలు ఉన్నాయి.. అయితే.. వీటిలో
చాలావరకూ ఏసీలు ప్రస్తుతం పనిచేయడం లేదు. ప్రధానంగా రోగులు ఉండే వార్డుల్లోని ఏసీలు నెలల తరబడి పాడైపోయి ఉన్నా.. పట్టించుకునే దిక్కు లేదు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏసీల
మరమ్మతుల కోసం సిబ్బందిని నియమించినా.. ఫలితం లేకుండాపోయింది. ఏసీల మెకానిక్‌లను నియమించాల్సిన స్థానంలో వాటితో సంబంధం లేని ఎలక్ట్రీషియన్లను పెట్టడంతో వారికి వీటిపై
అవగాహన ఉండడం లేదనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. అందుకే.. ఏసీలను బిగించిన ఆరు నెలలు కూడా పూర్తికాక ముందే.. వాటి కాలం చెల్లిందంటూ వీరు ధ్రువీకరిస్తుండడంతో వాటికి మరమ్మతులు కూడా చేయకుండా అలాగే వదిలేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రిలోని ఉన్నతాధికారులు, వైద్యుల గదుల్లో ఉన్న ఏసీలు మరమ్మతులకు గురైతే వెంటనే.. వాటికి పరిష్కారం చూపుతున్నారు. కొత్తది వేయడం లేదంటే మరమ్మతులు చేపట్టడం చేస్తున్నారు. అదే రోగుల వార్డుల్లోని ఏసీలైతే.. వాటిని పట్టించుకునేవాళ్లు, నిలదీసేవాళ్లు లేకపోవడంతో.. రెండు మూడు నెలలుగా కేవలం ఉత్సవ విగ్రహాల్లా ఉంటున్నాయని ఆసుపత్రికి చెందిన సిబ్బందే వెల్లడిస్తున్నారు. అసలే.. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగులు.. ఎండ వేడికి మరింత విలవిలలాడిపోతుండడంతో ప్రాణాల మీదకు వస్తోంది. ఒకవైపు వేడి, మరోవైపు వార్డుల్లో ఎవరూ పట్టించుకోవడం లేదని, వైద్యులు సైతం అందుబాటులో ఉండడం లేదంటూ  రోగులు వాపోతున్నారు. వార్డుల్లో ఒక ఏసీ పనిచేస్తే.. మరొకటి పనిచేయడం లేదంటూ గగ్గోలు పెడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫ్యాన్లు వేసుకుంటే.. వాటి నుంచి వచ్చే వేడి గాలికి రోగులకు భరించలేనంత ఉక్కపోత ఉంటోంది. చాలాకాలంగా ఆసుపత్రిలో ఏసీల నిర్వహణ సరిగా లేకపోవడంతో.. రూ.లక్షలు వెచ్చించి ఎన్ని కొనుగోలు చేస్తున్నా అవన్నీ కేవలం నెలల వ్యవధిలోనే మూలకు చేరుతున్నాయి. ఇదే సమస్యపై గతంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశాల్లో అనేకసార్లు చర్చకు వచ్చింది. కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఉన్న సమయంలో దీనికి పరిష్కారంగా.. ఏసీ మెకానిక్‌లను నియమించాలంటూ ఆదేశించారు. అర్హత ఉన్న ఏసీ మెకానిక్‌లకు బదులుగా ఎలక్ట్రీషియన్లను నియమించడంతో.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఏదైనా చిన్న మరమ్మతు వస్తే.. ఏసీ కాలం చెల్లిపోయిందంటూ వీళ్లు ధ్రువీకరించేస్తూ వదిలేస్తున్నట్టు సమాచారం. వాస్తవంగా ఆసుపత్రిలో వినియోగిస్తున్న ఏసీలన్నీ అత్యంత ఖరీదైన కంపెనీలకు చెందినవే. ఇవి ఇళ్లలో, మిగతా కార్యాలయాల్లో కనీసం పదేళ్లకు పైనే మన్నుతాయి. ఎంత ఎక్కువ వినియోగం ఉన్నా.. సరైన నిర్వహణ ఉంటే.. ఖచ్చితంగా పదేళ్లు ఉంటాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న ఏసీలు దాదాపు ఏవీ పదేళ్లకు పైబడినవి లేవు. అన్నీ రెండు మూడేళ్లలోపల కొన్నవే ఉన్నాయి. అదికూడా.. కొనుగోలు చేసిన.. ఆరు నుంచి ఏడాదిలోపల మరమ్మతుకు గురై.. వదిలేసినవే ఎక్కువ ఉన్నాయని ఆసుపత్రి సిబ్బందే వెల్లడిస్తున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించి.. ఆసుపత్రిలో ఉన్న ఏసీల్లో ఎన్ని పనిచేయడం లేదు, ఎందుకు చేయడం లేదనేది సరైన నిపుణుల ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేయిస్తే తప్ఫ. శాశ్వత పరిష్కారం దొరకదు. ఆసుపత్రిలో ఏసీలు.. కొద్ది నెలలకే పనిచేయకపోవడం వెనుక.. పరికరాలు మార్చడం వంటి.. మరేదైనా కారణం ఉండొచ్చేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. దీనిపైనా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Related Posts