యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతా పార్టీ బెంగాల్ లో జెండా పాతేయాలని గట్టిగా భావిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి దూకుడుకు పగ్గాలు వేయాలని నిర్ణయించుకుంది. అందుకే మమతను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నాలను మొదలుపెట్టింది. మమత ఎక్కడకు వెళ్లినా జై శ్రీరాం నినాదాలను చేస్తూ ఆమెకు చిరాకు తెప్పించే పనిలో పడింది.భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మమతకు అదిరిపోయే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మమత బెనర్జీ కూడా బీజేపీకి ఇలాంటి ఫలితాలు తన రాష్ట్రంలో వస్తాయని ఊహించలేదు. తృణమూల్ కాంగ్రెస్ కు 22 పార్లమెంటు స్థానాలు దక్కితే, బీజేపీకి 18 పార్లమెంటు స్థానాలు రావడం ఆశ్చర్యకరమైన ఫలితాలే. అంటే బీజేపీ ఎంత సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ చేసిందో ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి.కమలదళం ఒకటి పట్టుకుంటే ఒక పట్టాన వదలిపెట్టరు. ఇప్పుడు వరసగా టీఎంసీ ఎమ్మెల్యేలను టర్గెట్ చేశారు. మమత బెనర్జీని మానసికంగా దెబ్బకొట్టేందుకు జై శ్రీరాం నినాదాలతో పది లక్షల పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని చేపట్టారు. దీంతోపాటుగా స్థానిక సంస్థల పై కూడా కన్నేశారు. తొలిసారి బెంగాల్ మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరింది. భాటాపారా మున్సిపాలిటీని కమలం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటివరకూ ఈ మున్సిపాలిటీ మమత పార్టీ చేతిలోనే ఉండేది.అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితిని తిరిగి తమ చేతుల్లోకి
తెచ్చుకుంటానని మమత పైకి ధీమాగానే కన్పిస్తున్నప్పటికీ లోలోపల మాత్రం బెరుకుగానే ఉంది. దాదాపు దశాబ్దకాలం పాటు ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతున్న తన పాలనకు వచ్చే ఎన్నికల్లో
ఎక్కడ గండిపడుతుందోనన్న ఆందోళన మమతలో స్పష్టంగా కన్పిస్తోంది. అందుకే ఇటు ముస్లింలతో్ పాటు హిందువులను మచ్చిక చేసుకునే యత్నంలో పడ్డారు. బీజేపీకి హిందూ ఓటు బ్యాంకు మరలకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.