యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలక నాయకుడు. వివాద రహితుడిగా అందరినీ కలుపుకొని పోయే నేతగా కూడా గుర్తింపు పొందారు. తనదైన శైలిలో విమర్శలు చేస్తూ.. ప్రత్యర్థులను ఇరుకున పెట్టిన చరిత్రను కూడా సొంతం చేసుకున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి అన్ని విధాలా అండదండలు అందించిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనే నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత ఆత్మీయుడిగా గుర్తింపు పొందిన ఆయన వరుసగా నాలుగు సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ.. చంద్రబాబు దగ్గర మంచి మార్కులే సంపాయించుకున్నారు.బాబు ఏ కార్యక్రమాన్ని అప్పగించినా వివాదాలకు తావు లేకుండా నిర్వహించి విజయం సాధించిన నాయకుడిగా సోమిరెడ్డికి మంచి పేరుంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో సోమిరెడ్డి ఓటమి పాలైనప్పటికీ.. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటును ఇచ్చి గౌరవించారు. అంతేకాదు, తర్వాత 2017 జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చంద్రబాబు సోమిరెడ్డికి కేబినెట్ సీటు ఇచ్చి మరింత గౌరవించారు. అంతేకాదు, కీలకమైన వ్యవసాయ శాఖను ఆయన చేతిలో పెట్టారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా రాజకీయంగా ఎలాంటి విమర్శలు ఎదుర్కొనకుండానే ఈ శాఖను నిర్వహించారు సోమిరెడ్డి.ఇక, ఇప్పుడు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఐదోసారి పోటీ చేసి కూడా ఓడిపోవడంతో ఇప్పుడు సోమిరెడ్డి ఫ్యూచర్ ఏంటనే విషయంపై టీడీపీలోనే కాకుండా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కూడా చర్చ ప్రారంభమైంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆయన తనకుమారుడు రాజ్‌గోపాల్‌రెడ్డిని బరిలో నిలపాలని అనుకున్నారు. అయితే, పోటీ తీవ్రంగా ఉండడం, ప్రత్యర్తి బలంగా ఉండడంతో చంద్రబాబు సూచనల మేరకు సోమిరెడ్డి నేరుగా ఐదోసారి సర్వేపల్లి నుంచి పోటీ చేశారు.గట్టిపోటీ ఇచ్చి, సానుభూతిని పొందినా.. ఆయన వైసీపీ హవా ముందు నిలవలేక పోయారు.సర్వేపల్లిలో వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్థన్‌రెడ్డి చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయారు. జిల్లాలో తన రాజకీయ ప్రత్యర్థులు అందరూ ఇప్పుడు వైసీపీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో సోమిరెడ్డి రాజకీయ చదరంగంలో పూర్తిగా వెనకపడిపోయినట్లయ్యింది. ఇక ఇటు టీడీపీ జిల్లాలో ఎదగకపోవడానికి సోమిరెడ్డి కారణం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కిం కర్తవ్యం అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. ఇక, ఎన్నికలకుముందు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం మరో డ్రాబ్యాక్. మరి ఈ నేపథ్యంలో సోమిరెడ్డి రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయనున్నారనేది ప్రశ్న. తన కుమారుడిని రంగంలోకి దింపి తాను తెరవెనుక చక్రం తిప్పుతారనే ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.