యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా శనివారం ఉదయం ఈవో ఋత్విక్ వరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి ఈవో మీడియాతో మాట్లాడుతూ జూన్ 9 నుండి 13వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. టిటిడి అనుబంధ ఆలయాలలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తున్నామన్నారు. గతంలో 2007వ సంవత్సరం టిటిడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. ఇందులో భాగంగా జూన్ 9వ తేదీ రాత్రి 8.00 గంటలకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారని తెలిపారు. అదేవిధంగా జూన్ 12న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి మహాశాంతి తిరుమంజనం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 13న ఉదయం ''మహాపూర్ణాహుతి, ఉదయం 7.30 నుండి 9.00 గంటల వరకు మహాసంప్రోక్షణ జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 11.00 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపారు. యాగశాలలో వైధిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నట్లు తెలియజేశారు. ఈ వైధిక కార్యక్రమానికి యాగశాలలో 25 హోమగుండాలు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన 41 మంది రుత్వికులు పాల్గొంటున్నారని తెలిపారు. అదేవిధంగా టిటిడి స్థానిక ఆలయాల ఆర్జిత సేవలు ఆన్‌లైన్‌లో ఉంచడం వలన భక్తులు ముందస్తుగా బుక్ చేసుకుని సేవలలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అంతకుముందు ఈవో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇందులో భాగంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో సిద్ధం చేసిన శ్రీవారి అష్టబంధన యాగశాల,శ్రీ రంగనాథస్వామి యాగశాల, శ్రీ లక్ష్మీనారాయణ యాగశాలలను పరిశీలించారు.