యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో ఎక్కువగా నష్టపోయింది సమాజ్ వాదీ పార్టీ మాత్రమేనని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. మహాకూటమి వల్ల దారుణంగా దెబ్బతినిపోయామని లెక్కలు వేసే పనిలో ఉన్నారు. తమతో కలసి పోటీ చేసిన బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం భారీగానే లబ్ది పొందిందని ఎస్పీ నేతలు చెబుతున్నారు. అందుకే మాయావతి త్వరగా మహాకూటమి నుంచి వైదొలిగారని కూడా చెబుతున్నారు.2014 ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ వన్ సైడ్ విజయం సాధించింది. యూపీలో మొత్తం 80 లోక్ సభస్థానాలుంటే బీజేపీ 71 స్థానాలను, దాన మిత్రపక్షమైన అప్నాదళ్ రెండు స్థానాలను గెలచుకుంది. ఆ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ జీరో ఫలితాలను సాధించింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ జీరో నుంచి పది పార్లమెంటు స్థానాలకు ఎగబాకింది. సమాజ్ వాదీ పార్టీ మాత్రం గతంలో ఉన్న ఐదు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.శాసనసభ స్థానాల వారీగా చూసినా మాయావతికి చెందిన బీఎస్పీ దాదాపు డెబ్భయి స్థానాల్లో విజయం సాధించినట్లు ఎస్పీ నేతలు చెబుతున్నారు. మాయావతి చెబుతున్నట్లు యాదవ ఓట్లు బీఎస్పీకి పడలేదనడం సరికాదంటున్నారు. దళిత ఓట్లు సమాజ్ వాదీ పార్టీకి పడలేదని ఇందుకు అనేక ఉదాహరణలు కూడా వారు చూపుతున్నారు. దళిత ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న చోట్ల తాము గెలవలేకపోయామని, అక్కడ బీఎస్పీ ఓటు బ్యాంకు
బీజేపీకి వెళ్లిందని, అందుకే తాము ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయామని వివరిస్తున్నారు. పొత్తుతో మాయావతి కంటే ఎక్కువ తామే నష్టపోయామని అఖిలేష్ యాదవ్ కూడా అంగీకరిస్తున్నారు.ఇక మహాకూటమిలోని మరో మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్ సయితం రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. మహాకూటమితో వెళ్లడంతో ఈ పార్టీ నుంచి పోటీ చేసిన అగ్రనేతలు సయితం విజయం సాధించలేదు. స్వయంగా పార్టీ అధినేత అజిత్ సింగ్ ముజఫర్ నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడాన్ని వారు సయితం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో తాము కూడా పొత్తుతో నష్టపోయామని చెబుతున్నారు. త్వరలో జరగనున్న 11 శాసనసభ స్థానాల ఉప ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయాలని కూటమిలోని పార్టీలు నిర్ణయించాయి. ఆ ఫలితాల తర్వాత ఎవరి సత్తా ఏంటో తేలిపోనుంది.