Highlights
- బడ్జెట్ సమావేశాలకు వైసిపి సభ్యులు హాజరుకారు
- రాజ్యసభ 'ఏకగ్రీవ' ఎన్నిక..?
- వైయస్సార్సీపీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 5 న ఢిల్లీలో వైయస్సార్‌సీపీ మహా ధర్నా చేస్తునట్టు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెల్లడించారు. శనివారం ఆయనిక్కడ మొదట పార్టీ అద్యక్షుడు శ్రీ వైయస్ జగన్ తో సమావేశమయ్యారు. అనంతరం మేకపాటి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కొందరు పార్టీ నేతలు ఢిల్లీకి చేరుకున్నారని, మిగిలిన వారంతా శనివారమే బయలు దేరుతారని చెప్పారు. విభజన చట్టంలోని ఆదేశాలను అమలు పర్చకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదన్నారు. 11 రాష్ట్రాలకు హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి మాత్రం హోదాని ఇవ్వడం లేదని వాపోయారు. కేంద్రానికి కనువిప్పు కలిగించేలా వైయస్సార్‌సీపీ ఆందోళన చేస్తోందని గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా గురించి మాట మారుస్తున్నారని, ఒక రోజు హోదా వల్ల ప్రయోజన ఏమిటని మరో రోజు హోదా కావాలని, అంటున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు రోజుకో మాట చెబుతున్నారని మండిపడ్డారు. హోదా డిమాండు చేస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని కూడా లోక్‌సభలో ప్రవేశపెడతామని చెప్పారు. ఈ తీర్మానానికి ఇతర పార్టీల వారు ఏమేరకు మద్దతు ఇస్తారో చూడాలన్నారు. హోదాపై 184 నిబంధన కింద ఇచ్చిన నోటీసుపై కూడా లోక్‌సభలో చర్చ జరుగుతుందని మేకపాటి అన్నారు.
రాజ్యసభ 'ఏకగ్రీవ' ఎన్నిక..?
రాజ్యసభ ఎన్నికలలో మూడు సీట్లకు గాను రేండు సీట్లు టీడీపీకి, ఒక సీటు వైయస్సార్‌సీపీకి దక్కుతాయన్న ఆశాబావాన్ని వ్యక్తం చేశారు. ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఉన్నదని చెప్పారు.ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనివ్వకుండా చంద్రబాబు అవినీతి అక్రమాలకు పాల్పడితే ఆయన కొంప కొల్లేరవుతుందని హెచ్చరించారు.
బడ్జెట్ సమావేశాలకు వైసిపి సభ్యులు హాజరుకారు..
ఈ నెల ఐదోవ తేదీ నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తమ పార్టీ ఎంఎల్ ఏలు హాజరు కారని స్పష్టం చేశారు. వైయస్సార్‌సీపీకి చెందిన ఏడుగురు ఎంఎల్ సీలు కూడా హాజరు కారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ ఏలతో తమ తమ పదవులకు రాజీనామా చేయించి.. తిరిగి ఎన్నికలు నిర్వహించెంత వరకు తమ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తారని చెప్పారు. చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మేకపాటి విమర్శించారు. వైయస్సార్‌సీపీకి చెందిన 23 మంది వైయస్సార్‌సీపీ ఎంఎల్ ఏలను , ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారని చెప్పారు.. కొందరు ఎంఎల్ ఏలకు మంత్రి పదవులు కూడా ఇచ్చారని విమర్శించారు.అసెంబ్లీ సీట్లుపెరుగుతాయని చంద్రబాబు పెద్ద ఎత్తున ప్రచారం చేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని , ప్రతిపక్ష ఎంఎల్ ఏలను వంచించి తీసుకున్నారని విమర్శించారు. అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరగదని కేంద్రం ఇది వరకే.స్పష్టం చేసిన సంగతిని మేకపాటి గుర్తు చేశారు.