యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
జగన్ ‘టీమ్ 25’ ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. ఈ టీమ్‌లో ముగ్గురు మహిళా మంత్రులకు జగన్ అవకాశం ఇచ్చారు. అలాగే కష్టకాలంలోనూ ఆయన వెంట నడిచిన విధేయులకూ ఈ కెబినెట్‌లో చోటు కల్పించారు. వీరిలో కొందరికి ఊహించకుండానే మంత్రు పదవులు దక్కడం గమనార్హం. ఎవరికి ఏ శాఖ అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ టీమ్‌లో అందరికంటే చిన్న వయస్సు మంత్రిగా పాముల పుష్ప శ్రీవాణి ప్రమాణ స్వీకారం చేశారు. సీనియర్ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ అందరికంటే పెద్దవారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పుష్ప శ్రీవాణి వివాహం తర్వాత విజయనగరం జిల్లా జియమ్మవలస మండలంలోని చినమేరంగి కోటలో స్థిరపడ్డారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ఆమె.. భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. కురుపాం అసెంబ్లీ స్థానం నుంచి ఎస్టీ కోటాలో పోటీ చేసిన ఆమె రెండోసార్లు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 27 ఏళ్ల వయసులో శ్రీవాణి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం. వైసీపీ తరుపున బరిలో దిగిన ఆమె 19,083 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ 26,602 ఓట్ల ఆధిక్యతతో విజయకేతనం ఎగురవేశారు. 31 ఏళ్లకే మంత్రిగా ఛాన్స్ దక్కించుకున్నారు. టీడీపీ ప్రభుత్వంలో కూడా యువతకు అవకాశం దక్కింది. భూమా అఖిల ప్రియ, కిడారి శ్రావణ్ కుమార్‌లకు 28 ఏళ్లకే మంత్రులయ్యారు. శ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖను కేటాయించారు.
పెద్దన్నగా పిల్లి: ఏపీ కెబినెట్‌లో 69 ఏళ్ల పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దన్న పాత్ర పోషించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి బరిలోకి దిగిన పిల్లి విజయం సాధించకున్నా.. మంత్రి పదవిని దక్కించుకోవడం గమనార్హం. 1985లో మొట్టమొదట కాంగ్రెస్ అభ్యర్థిగా రామచంద్రపురం నుంచి బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 1989లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2004లో ఇండిపెండెంట్‌గా, 2009లో మళ్లీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. 2012 ఉప ఎన్నికల్లో, 2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ నుంచి రామచంద్రపురం నుంచి పోటీ చేసినా విజయం వరించలేదు. జగన్ కేబినెట్‌లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగానే కాకుండా డిప్యుటీ సీఎం హోదాను కూడా దక్కించుకున్నారు.