ఏపీ సచివాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. అధికారులు సహకరిస్తేనే ప్రభుత్వ, ప్రజల కలలు నెరవేరుతాయని చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమను ఎన్నుకున్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. అవినీతి నిర్మూలన అందరి లక్ష్యం కావాలి. అధికారులు తమకు ఉన్న పూర్తి అవగాహనతో సహకరించాలి. మంచి పనితీరు ప్రదర్శించే అధికారులను గౌరవించి, సత్కరిస్తాను అని జగన్ తెలిపారు. మన పాలన దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయండి అని సూచించారు. అధికారులపై తనకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి దృఢసంకల్పంతో ఉన్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ర్టానికి సీబీఐ రావడంలో అభ్యంతరం లేదని సీఎం జగన్ తెలిపారు.
ప్రొటెం స్పీకర్ గా శంబంగి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా శంబంగి వెంకటచిన్న అప్పలనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. శంబంగి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, కొత్తగా ఎంపికైన మంత్రులు, సచివాలయ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అప్పలనాయుడిని గవర్నర్ నరసింహన్, సీఎం జగన్ అభినందించారు. బొబ్బిలి నియోజకవర్గం నుంచి శంబంగి.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా శాసనసభ సమావేశాల తొలిరోజున ఎమ్మెల్యేల చేత శంబంగి ప్రమాణస్వీకారం చేయిస్తారు. స్పీకర్ ఎన్నిక కొనసాగే వరకు శంబంగి ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారు.