యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఓటమిపై అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా విజయవాడ పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్టీ ఓటమి, భవిష్యత్ కార్యాచరణపై జనసేనాని చర్చించారు. ఎన్నికలు పద్దతిగా జరిగి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల సమయంలో.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని.. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కేంద్రంలో ఉన్న బీజేపీలతో పోరాడామన్నారు. ఫలితాలతో దిగులుపడకుండా.. ఈ ఎన్నికల్లో ఎదురైన అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ముందుకు సాగాలన్నారు. జనసేన పార్టీ ఒక ఎన్నికల కోసం మొదలుపెట్టిన ప్రయాణం కాదన్నారు జనసేనాని. ఇతర పార్టీలు ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేశారని.. జనసేన నాలుగేళ్ల క్రితం పోటీ చేసినట్లయితే బలం పెరిగేదన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు రూ.150 కోట్లు దాటిందని.. జనసేన ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేసిందన్నారు. మహిళలు, యువతీ, యువకులు స్వచ్ఛందంగా జనసేనకు అండగా నిలిచారని.. అందుకే ఇన్ని లక్షల ఓట్లు వచ్చాయన్నారు. ప్రజల కోసం ఎంత బలంగా నిలబడామన్నదే ముఖ్యమన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా పవన్ నేతలతో చర్చించారు. సమీక్షలు పూర్తి చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ క్లారిటీకి వద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ముందుకెళ్లాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి కేడర్‌లో పునరుత్తేజింప చేసి.. బలోపేతం చేయాలని నేతలకు పిలిపునిచ్చారు. అలాగే జనసేన తరపున రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ను అభినందించారు.
రెండు లక్షల ఓట్లొచ్చాయి
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ విశాఖ జిల్లా అభ్యర్థులతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ కోర్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ముఖ్యనేతలు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్, మాదాసు గంగాధరం తదితరులు పవన్ తో సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మార్పు ప్రారంభమైందని, భవిష్యత్తులో జనసేన పార్టీ పుంజుకుంటుందని అన్నారు.ఎన్నికల్లో తాము గెలవకపోయినా, 2 లక్షల మందికి పైగా తమను ఓటుతో ఆశీర్వదించారని, కొద్దిసమయంలోనే ఇంత పురోగతి సాధించడం మామూలు విషయం కాదన్నారు. ఇక, సమీక్ష గురించి చెబుతూ, ఈసారి ఎన్నికల్లో జనసేనలో లోపాలు ఎక్కడెక్కడ వచ్చాయి అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అందరితో చర్చించారని తెలిపారు. జనసేన ప్రతిపాదించిన జీరో బడ్జెట్ పాలిటిక్స్ యువతలోకి వెళ్లిందని, ధనప్రభావం లేని రాజకీయాలపై యువతలో ఆసక్తి మొదలైందని అన్నారు. గతంలో తాను రైతులను కలిసేందుకు పాదయాత్ర చేశానని, ఇకముందు కూడా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తానని వెల్లడించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్దకు కూడా వెళతామని సీబీఐ మాజీ జేడీ స్పష్టం చేశారు.