YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వేగంగా బందరు పోర్ట్ పనులు

వేగంగా  బందరు పోర్ట్ పనులు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

బందరు ఓడరేవు, అను బంధ పరిశ్రమల కోసం భూ సమీకరణ ప్రక్రియ వేగం పుంజు కుంటోంది. 14 వేల ఎకరాలకు పైబడి ప్రైవేటు భూములను సేకరించాల్సిన లక్ష్యంలో భాగంగా సంబంధిత గ్రామాల్లో రైతుల్లో అనుమానాలు, సందేహాలు నివృత్తి చేసే బాధ్యత మడ డిప్యూటీ కలెక్టర్లు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా కలవలేని వారు మడ కార్యాలయానికి వచ్చి తమ సందేహాలను తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటి వరకూ దాదాపు 2 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చి నిరభ్యంతర పత్రాలను అందజేశారు. గతంలో భూసేకరణ నోటిఫికేషన్‌ వెలువరించిన నేపథ్యంలో ఆయా గ్రామాల పరిధిలోని భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. తమ వ్యక్తిగత, ఆరోగ్యపరమైన అవసరాల కోసం భూములు విక్రయించేందుకు అడ్డంకి ఏర్పడటం పట్ల గ్రామాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది. భూ సమీకరణ అంశం తెరపైకి వచ్చాక కూడా వరకూ క్రయ విక్రయాలపై నిషేధం ఉండటం స్థానికులకు ఇబ్బంది కరంగా మారింది. గడచిన కొన్ని వారాలుగా పలువురు రైతులు భూములిచ్చేందుకు నిరభ్యంతర పత్రాలు అందచేశారు. తాజాగా కలెక్టర్‌ బాబు మడ అధికారులతో సమావేశమై భూ సమీకరణ పరిస్థితిని సమీక్షించారు.. అసైన్డ్ భూముల విషయంలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసేవిధంగా హక్కుదారులు ఎవరన్న అంశంపై సర్వే చేపట్టారు. భూసమీకరణ పక్రియలో భూములు సమీకరించడం ఒక ఎత్తయితే, అర్హులైన రైతు కూలీలను గుర్తించి వారికి పింఛను అందచేయాల్సి ఉండటం మరో ఎత్తు. భూమి లేని పేదలైన రైతు కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇస్తామని సమీకరణ ప్యాకేజీలో ప్రభుత్వం ప్రకటించింది. భూములిచ్చిన రైతులకు ఏడాదికి ఎకరా మెట్టకు రూ.30,000, మాగాణికి రూ.50,000 చొప్పున పది సంవత్సరాల పాటు ఏటా కొంత శాతం పెంపుతో కౌలు చెల్లించాల్సి ఉంది. భూములు లేకపోవడంతో రైతు కూలీలు ఉపాధి కోల్పోయే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి పదేళ్ల పాటు పింఛను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రతి రైతుకూలీకి ఏడాదికి రూ.25,000 పింఛను రూపంలో నెలనెలా ఇవ్వాలి. అంటే దాదాపు ఎకరా మెట్ట భూమికి ఇచ్చే కౌలుతో సమానం. ప్రస్తుతం మడ పరిధిలోని గ్రామాల్లో అధికారులు రైతు కూలీల సర్వేను ప్రారంభించారు. రైతుకూలీల నమోదుకు సంబంధించి ప్రొఫార్మాలు రావాల్సి ఉంది. మొత్తం మీద ప్రాథమిక అంచనా మేరకు 29 గ్రామాల పరిధిలో 15,000 వరకూ రైతు కూలీలు ఉండే అవకాశం ఉంది. కేవలం ఒక్క సెంటు భూమి కూడా లేని రైతు కూలీ కుటుంబంలో ఒక్కరి మాత్రమే పింఛను వర్తిస్తుంది. రాజధాని అమరావతి విషయంలో రైతుకూలీలకు పింఛను చెల్లించేందుకు దాదాపు ఏడాది సమయం పట్టింది. మడ విషయంలో రైతుకూలీలు ఎంత మంది నిర్ధరణ చేసిన నెల వ్యవధిలోనే పింఛను చెల్లింపులుంటాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Related Posts