యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అమరావతికి వెళ్లే రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుంటూరు-బాపట్ల రహ దారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో రూ.849 కోట్ల వ్యయంతో ఆయా పనులు చేపట్టనున్నారు. నాలుగు వరుసల రహదారి పూర్తయితే అత్యంత రద్దీగా ఉండే ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్య తగ్గి ప్రజలు వేగంగా రాకపోకలు సాగించటానికి అవకాశం లభిస్తుంది. బాపట్ల- గుంటూరు మధ్య ఆర్‌అండ్‌బీ రహదారిని జీబీసీగా వ్యవహరిస్తారు. 50 కిలోమీటర్ల మేర ఉన్న ఇది రాష్ట్ర రహదారిగా ఉంది. రాజధానిగా అమ రావతిని ఎంపిక చేసిన తర్వాత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. పర్చూరు, చీరాల, బాపట్ల, పొన్నూరు, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వాహనాలు ఈ మార్గాన గుంటూరుకు రాకపోకలు సాగిస్తుంటాయి. నారాకోడూరు జంక్షను వద్ద తెనాలి నుంచి వచ్చే వాహనాలు జత కలుస్తాయి. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించటానికి ఎనిమిదేళ్ల క్రితమే నిర్ణయించారు. దీనికయ్యే పూర్తి వ్యయాన్ని భరించే స్థితిలో ప్రభుత్వం లేనందున పీపీపీ విధానంలో బీవోటీ పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఎట్టకేలకు నిర్ణయించారు. రహదారి విస్తరణ పనులు చేపట్టడానికి రూ.572 కోట్ల వ్యయంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రైవేటు నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే ఎవరూ ముందుకురాలేదు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్మించిన తర్వాత వాహనదారుల నుంచి కేవలం టోల్ రూపంలో డబ్బులు వసూలు చేసి వ్యయాన్ని తిరిగా రాబట్టి లాభాలు సాధించటానికి ఏళ్ల సమయం పడుతుందని, ఈ ప్రాజెక్టు అంతగా లాభసాటి కాదన్న భావనతో కాంట్రాక్టర్లు బిడ్లను వేయలేదు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం రహదారుల నిర్మాణ ప్రాజెక్టులు భారంగా మారుతున్నాయని తప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపీపీ విధానంలో బీవోటీ పద్ధతిలో వాటి నిర్మాణానికి గుత్తేదారులు, నిర్మాణ రంగ సంస్థలను ఆకర్షించటానికి టోల్+యాన్యుటీ విధానాన్ని కొత్తగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొత్త విధానంలో రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసిన వారికి ప్రాజెక్టు వ్యయంలో కొంత మొత్తాన్ని దశలవారీగా చెల్లిస్తుంది. మిగిలిన సొమ్మును టోల్ రూపంలో వసూలు చేసుకోవాల్సివుంది. ఈ విధానంలో గుంటూరు-బాపట్ల రహదారిని 3.30 నుంచి 49.79 వరకు మొత్తం 46 కి.మీ. పొడవునా నాలుగు వరుసలు అంటే 14 మీటర్ల వెడల్పుగా విస్తరించనుంది. మధ్యలో నాలుగు చోట్ల(నారాకోడూరు-చేబ్రోలు, మునిపల్లె, పొన్నూరు, అప్పికట్ల) బైపాస్‌లు ఏర్పాటు చేయనుంది. గుంటూరు నుంచి నారాకోడూరు వరకు 10 మీటర్ల వెడల్పున ఇప్పటికే రహదారిని విస్తరించగా మిగతా ప్రాంతాల్లో 6.57 మీటర్లు మాత్రమే ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రహదారి నిర్మాణ పనులకు రూ.571 కోట్లు, భూసేకరణకు రూ.207 కోట్లు, పునరావాస, పునఃస్థాపనకు రూ.46 కోట్లు, కల్వర్టులు, స్తంభాలువంటివి మార్చటానికి రూ.25 కోట్లు కేటాయించారు. ఇప్పటికే నారాకోడూరు నుంచి చేబ్రోలులోని కొమ్మమూరు కాలువ వరకు, మునిపల్లె నుంచి పొన్నూరు ఆంజనేయస్వామి ఆలయం వరకు సీఆర్‌ఎఫ్ నిధులు రూ.12 కోట్ల వ్యయంతో పది మీటర్ల వెడల్పున జీబీసీ రహదారిని విస్తరిస్తున్నారు.