యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ మంత్రివర్గం కొలువుదీరింది. ఈ నెల 8న అమరావతిలో ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయ్యింది. సోమవారం తొలి కేబినెట్ సమావేశం జరిగింది.. మంత్రులు పాలనపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైపోయారు. త్వరలోనే సచివాలయంలోని ఛాంబర్లలోకి అడుగు పెట్టబోతున్నారు. పాపం మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి రెండు రోజులు కూడా గడవకముందే కొత్త తలనొప్పి వచ్చిపడింది. సోషల్ మీడియా దెబ్బకు మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. తమ ఫోన్లకు వచ్చే కాల్స్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రెండు రోజులుగా ఈ ఫోన్ల తాకిడి ఎక్కువైపోయిందట. దీనికి కారణం మంత్రుల ఫోన్ నెంబర్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడమే. మంత్రుల ఫోన్ నెంబర్ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత వరుసగా షేర్లు రావడంతో.. ఆ ఫోన్ నెంబర్లు వైరలయ్యాయి. ఇంకేముంది జనాలు మంత్రులకు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. వరుసపెట్టి ఫోన్ కాల్స్ రావడంతో మంత్రులకు తలనొప్పి మొదలయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్యాప్ లేకుండా వరుసపెట్టి ఫోన్లు వస్తూనే ఉన్నాయట. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తుండటంతో.. ఆ తాకిడి తట్టుకోలేక కొందరు ఫోన్లు స్విచాఫ్ చేయాల్సి వస్తోందట.