టీడీపీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని తుఫాన్ కొనసాగుతోంది. రోజుకో ఫేస్బుక్ పోస్టుతో కాకరేపుతున్న టీడీపీ ఎంపీ.. మళ్లీ సంచలనానికి తెరలేపారు. ఈసారి ఏకంగా పార్టీలో సీనియర్ నేతపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. బెజవాడ పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతోంది. మంత్రి కొడాలి నానిని ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావును టార్గెట్ చేస్తూ మరో సంచలనం రేపారు. నాని తన పోస్టులో.. ‘కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని. ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి’అన్నారు. ఇద్దరి ఫోటోలతో సహా ఈ పోస్టును ఫేస్బుక్లో పెట్టారు. కొడాలి నాని మంత్రి పదవికి.. దేవినేని ఉమామహేశ్వరరావుకు సంబంధం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. కేశినేని నాని ఏం చెప్పాలనుకొని ఈ పోస్టు పెట్టారనే చర్చ మొదలయ్యింది. ఇటు నాని పోస్టుపై తెలుగు తమ్ముళ్లు స్పందిస్తున్నారు. ‘ఒక సీనియర్ నాయకుడిగా మీరు మార్గదర్శకుడిగా ఉండండి సర్.. ఇలాంటి ఛీఫ్ మెసేజెస్ పెట్టి కార్యకర్తల్లో అభద్రతాబావాన్ని రేపమాకండి. కొంచెం హుందాగా వ్యవహరించండి సార్.. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారెందుకు..? అంటూ నానిని టార్గెట్ చేశారు. నాని పోస్టుపై టీడీపీలో చర్చ మొదలయ్యింది. మరి దీనిపై నాని ఎలా స్పందిస్తారో చూడాలి. నాని కొద్దిరోజులుగా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పార్లమెంటరీ పదవుల నియామకంపై అలకబూనారు. పార్లమెంటరీ ఉపనేత, విప్ పదవులు ఇచ్చినా తిరస్కరించారు. దీంతో చంద్రబాబు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను పంపించి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దీంతో అధినేత చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు.. నాని పిలిపించి మాట్లాడారు. బాబుతో భేటీ తర్వాత కాస్త మెత్తబడినట్లు కనిపించారు.. కానీ మళ్లీ కొత్త పోస్టుతో సంచలనం రేపారు.