యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
గిరీశ్ కర్నాడ్ ఇకలేరు. కానీ ఆయన రచనలు మనల్ని వదిలివెళ్లవు. కన్నడలో ఆయన రాసిన అనేక పుస్తకాలు ఆణిముత్యాలు. థియేటర్ ఆర్ట్‌లోనూ ఆయనకు సాటిలేరెవ్వరు. ఇవాళ బెంగుళూరులో ఆయన తుది శ్వాస విడిచారు. తుగ్లక్, హయవదన లాంటి ఫేమస్ నాటకాలను కర్నాడ్ రాశారు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ గిరీశ్ స్థానం విశిష్టమైంది. 1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ గ్రామంలో గిరీశ్ పుట్టారు. కర్నాటకలోని ధార్వాడ, సిర్‌సిలో ఆయన పెరిగారు. అక్కడే ఆయనకు థియేటర్ ఆర్ట్ పట్ల మక్కువ కలిగింది. గ్రామాల్లో వేసే నాటకాలు ఆయన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ధార్వాడలోని కర్నాటక ఆర్ట్స్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రాలను ఆక్స్‌ఫర్డ్‌లో ఆయన పూర్తి చేశారు.ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ ప్రెస్‌లో ఆయన కొన్నేళ్లు పనిచేశారు. ఆ తర్వాతే రచనలపై పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు. 1961లో మొదటి నాటకం రాశారు. యయాతి అనే నాటకాన్ని ఆయన రచించారు. 1964లో తుగ్లక్ నాటకాన్ని రాశారు. 1971లో హయవదన నాటకాన్ని రాశారు. కన్నడ భాషలోనే ఆయన తన రచనలు కొనసాగించారు. ఆ తర్వాత వాటిని ఇంగ్లీష్‌తో పాటు ఇతర భాషలకు అనువదించారు. ఆధునిక కన్నడ నాటక రంగం అంతా గిరీశ్ కర్నాడ్ ఆధ్వర్యంలోనే వృద్ధి చెందింది. సినీ నటుడిగా కూడా గిరీశ్ సుదీర్ఘ కెరీర్‌ను కొనసాగించారు. 1970లో వచ్చిన సంస్కార చిత్రంలో ఆయన నటించి ప్రత్యేక ప్రశంసలు పొందారు. నిషాంత్, మంథన్, డోర్లాం టి హిందీ చిత్రాలోనూ నటించారు. 1971లో రిలీజైన వంశవృక్ష, 1984లో వచ్చిన ఉత్సవ్ చిత్రాలను ఆయన డైరక్ట్ చేశారు. టీవీ ప్రేక్షకులకు మాత్రం గిరీశ్ మరీ ప్రత్యేకంగా కనిపిస్తారు. మాల్గుడి డేస్, ఇంద్రధనుష్ లాంటి సీరియళ్లలో గిరీశ్ నటించారు. గత ఏడాది రిలీజైన టైగర్ జిందా హై హిందీ సినిమాలో గిరీశ్ చివరిసారి కనిపించారు. గిరీశ్ కర్నాడ్ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. మతఛాందసవాదులను ఆయన తీవ్రంగా విమర్శించేవారు. పద్మశ్రీ, పద్మభూషణ్, జ్ఞానపీఠ్ అవార్డులను ఆయన అందుకున్నారు. అనేక చిత్రాలకు జాతీయ ఫిల్మ్ అవార్డులను స్వీకరించారు. వంశ వృక్షం సినిమాకు బెస్ట్ డైరక్టర్ అవార్డును గెలుచుకున్నారు. కర్నాడ మృతి పట్ల ప్రధాని మోదీ నివాళి అర్పించారు.