యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తమ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలని ఇవాళ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ పౌరులను కోరారు. బహిర్గతం చేయని ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని వెల్లడించాలన్నారు. జూన్ 30వ తేదీ లోగా ఆ వివరాలను ప్రకటించాలన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతున్నది. 2019-20 సంవత్సరానికి ఇమ్రాన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గొప్ప దేశంగా మనం ఎదగాలంటే, మనం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తులు వెల్లడించే స్కీమ్‌లో ప్రజలందరూ పాల్గొనాలన్నారు. పన్నులు చెల్లించలేని తరుణంలో దేశాన్ని అగ్రభాగాన నిలుపలేమన్నారు. బినామీ ఆస్తులు ఉంటే వాటిని జూన్ 30వ తేదీలోగా చెప్పాలన్నారు. విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ల వివరాలను కూడా వెల్లడించాలన్నారు. ఒకవేళ వివరాలు వెల్లడించని క్రమంలో.. జూన్ 30వ తేదీ తర్వాత పరిస్థితి మరోలా ఉంటుందన్నారు. బినామీ అకౌంట్లు, ప్రాపర్టీలు ఉన్న వారి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, పన్ను అధికారులు వారి పనిపడుతారన్నారు. అసెట్స్ డిక్లరేషన్ స్కీమ్‌ను అందరూ వినియోగించుకోవాలన్నారు.