రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ లోని కొన్ని ప్రభుత్వ భవనాలను ఏపీ పరిపాలన కోసం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతి కేంద్రంగా ఏపీ పరిపాలన సాగుతుండడంతో హైదరాబాద్ లోని ఆ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, వాటిలోని అత్యధిక భవనాలను గవర్నర్ నరసింహన్ చొరవతో తెలంగాణకు కేటాయించారు. ఏపీ హోంశాఖకు, ఇతర ముఖ్య శాఖలకు రెండు భవనాలు ఇచ్చి మిగతావాటిని తెలంగాణకు కేటాయించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణకు కేటాయించిన భవనాల నుంచి సామగ్రిని అమరావతి తరలిస్తున్నారు. హైదరాబాద్ లోని ఏపీ సచివాలయంలో ఉన్న విలువైన స్టేషనరీ, ఫర్నిచర్, ఇతర సామగ్రిని అధికారులు ప్రత్యేక వాహనాల్లో అమరావతి పంపిస్తున్నారు. ఏపీ జీఏడీ అధికారుల పర్యవేక్షణలో ఈ తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ తరపున రామకృష్ణరావు, ఆంధ్రప్రదేశ్ తరపున ప్రేమ్‌చంద్రారెడ్డిలు సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఏపీకి చెందిన భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు. సచివాలయ భవనాలను తెలంగాణ జీఏడీకి, అసెంబ్లీ భవనాలను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి, ఎమ్మెల్యేల క్వార్టర్లను ఎస్టేట్ ఆఫీసర్‌కు అప్పగించాలని నిర్ణయించారు. వారం రోజుల్లో భవనాల అప్పగింత పూర్తవుతుందని వెల్లడించారు.