యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన భోగ శ్రీనివాసమూర్తిని పల్లవరాణి సామవై తిరుమలలో ప్రతిష్ఠించారు. శ్రీవారి ఆలయంలో ఈ విగ్రహాన్ని ఆమె ప్రతిష్ఠించిన సుదినాన్ని పురస్కరించుకుని ఏటా భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఈ క్రతువును ఆదివారం నాడు వైభవంగా నిర్వహించింది. ఇందులో బాగంగా ఉదయం శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వార్ సన్నిధిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, భోగ శ్రీనివాసమూర్తి, విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు. శ్రీవారి మూలమూర్తికి ముందు గరుడాళ్వార్ సన్నిధిలోని కౌతుకమూర్తి మనవాళపెరుమాళ్‌ను, అయనకు అభిముఖంగా విష్వక్సేనులవారిని ఉంచారు. తర్వాత శ్రీవారి మూలమూర్తిని భోగ శ్రీనివాసుడికి దారం కట్టి అనుసంధానం చేశారు. భోగ శ్రీనివాసమూర్తికి నిర్వహించే అభిషేకాధి క్రతువులు మూలమూర్తికి నిర్వహించినట్లు అవుతుందని అర్థం. అనంతరం పండితులు వేద పారాయణం చేయగా, అర్చకులు ఏకాంతంగా ప్రత్యేక సహస్రకలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. భోగశ్రీనివాసమూర్తి విగ్రహానికి చారిత్రక నేపథ్యం ఉంది. పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614 సంవత్సరం జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవైన వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. దీనికి సంబంధించిన శాసనం ఆలయ మొదటి ప్రాకారంలోని విమాన వేంకటేశ్వరుని విగ్రహం కింది భాగంలో గోడపైన కనిపిస్తుంది. ఆగమం ప్రకారం భోగ శ్రీనివాసమూర్తిని కౌతుకమూర్తి, మనవాళపెరుమాళ్ అనే పేర్లతోనూ పిలుస్తారు. కాగా, శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆదివారం ప్రారంభమైన ఈ క్రతువు గురువారం మహాసంప్రోక్షణతో ముగియనుంది. మహాసంప్రోక్షణలో భాగంగా ఆదివారం ఉదయం 8.30 నుంచి 11.00 గంటల వరకు యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 9.30 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేశారు. ఈ కుంభాలతోపాటు ఉత్సవమూర్తులను యాగశాలలోకి వేంచేపు చేశారు. కుంభ స్థాపన, అగ్ని ప్రతిష్ట, యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ః