యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే 10రోజులు ఆలస్యంగా కేరళలోకి ఎంట్రీ ఇచ్చిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడం మరింత ఆలస్యమయ్యే అవకాశం
కనిపిస్తోంది. రుతుపవనాలు విస్తరణకు అరేబియా సముద్రంలోని పరిస్థితులు ప్రతికూలంగా మారినట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. నైరుతి రుతుపవనాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దాదాపు 10రోజులు ఆలస్యంగా కేరళను తాకిన రుతు పవనాలకు తుపాను రూపంలో ప్రతికూల పరిస్థితి నెలకొంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా బలపడి, ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. దాంతో గాల్లోని తేమ నైరుతి రుతుపవనాల విస్తరణను అడ్డుకుంటున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. వాస్తవానికి రుతు పవనాలు ప్రవేశించాక అల్పపీడనాలు ఏర్పడితే అవి మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి. కానీ, ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అల్పపీడనం తుపానుగా బలపడుతుండటంతో రుతు పవనాల్లో చురుకుదనం తగ్గి ఇతర ప్రాంతాలకు విస్తరించటంలో జాప్యం జరుగుతోంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అరేబియా సముద్రంలో తుపాను కారణంగా తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాల రాక ఆలస్యం కానుంది. దాంతో మరో మూడ్రోజులు ఏపీ, తెలంగాణలో ఎండల తీవ్రత కొనసాగనుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే, ఈనెల 12న రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, అలాగే 13, 14 తేదీలకల్లా కోస్తాంధ్ర అంతటా విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక
15, 16 తేదీల నాటికల్లా తెలంగాణవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది. అయితే ఈసారి 15 నుంచి 20 శాతం తక్కువగా వర్షపాతం నమోదవుతుందని, అలాగే నైరుతి రుతుపవనాల కారణంగా భారీ వర్షాలు పడే ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడతాయని తెలిపింది