YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

 వేసవిలో వడగాల్పుల తీవ్రత అధికం

Highlights

  •  ఏప్రిల్ నుండి జూన్ వరకు ప్రభావం 
  •  హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ కి చర్యలు 
  • ఉష్ణోగ్రత పై  ఎస్ ఎం ఎస్, వాట్సాప్ గ్రూప్ ల్లో అప్రమత్తం
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశాలు
 వేసవిలో వడగాల్పుల తీవ్రత అధికం

వేసవిలో ఏప్రిల్ నుండి జూన్ వరకు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. 
శనివారం సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన హీట్ వేవ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత వేసవిలో 23 రోజులు వడగాల్పులు వీచాయని ఈసారికూడా మరిన్ని రోజులు అధికంగా వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు వడదెబ్బకు గురి కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. వడగాల్పుల తీవ్రతపై కలర్ కోడింగ్ తో ఎప్పటికప్పుడు సూచనలను  అధికార యంత్రాంగానికి, ప్రజలకు చేరేలా చూడాలన్నారు. జిల్లాలలో తగు ఓఅర్ ఎస్ ,ఐవీ  ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్ లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎప్పటికప్పుడు హెల్త్ అడ్వైజరీస్ విడుదల చేయాలన్నారు. ఆశా వర్కర్లు, ఏఎన్ ఎంలు, అంగన్ వాడి సిబ్భందికి తగు శిక్షణ నివ్వాలన్నారు. సమాచార శాఖ ద్వారా వడగాల్పుల తీవ్రత పై పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగ్స్, సోషల్ మీడియా, టి.వి, రేడియోల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు, వృద్ధులు, కార్మికులు, చిన్నపిల్లలు వడదెబ్బకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వడగాల్పుల కార్యచరణ ప్రణాళిక అమలుపై జిల్లా కలెక్టర్లకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేశామని సి.యస్ వివరించారు. పశువులు, గొర్రెలకు త్రాగు నీరు, పశుగ్రాసం కొరత రాకుండా చూడాలన్నారు.పశువులు, గొర్రెల కోసం ప్రత్యేకంగా షెడ్స్ నిర్మించే పనులను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో పశువుల కోసం ఇప్పటికే 10 వేల వాటర్ టబ్స్ ఉన్నాయని, మరో 12 వేల వాటర్ టబ్స్, 7 వేల షీప్ షెడ్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పశుగ్రాస కొరత రాకుండా కార్యచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. వడగాల్పులకు సంబంధించి పాఠశాలలు, కళాశాలల విద్యార్ధులను చైతన్యం చేయాలన్నారు. ముఖ్యమైన దేవాలయాలు, మసీదులు, చర్చీలు, మాల్స్ లలో తగు సదుపాయాలు కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్ధల భాగస్వామ్యంతో వీలైనన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీటిని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు.వడదెబ్బకు గురయ్యే ప్రభావిత ప్రాంతాలు, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. అటవీ ప్రాంతాలలో వన్యప్రాణులకు మంచినీటి కొరత రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అటవీ ప్రాంతాలలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు, మెట్రొరేల్వేస్టేషన్లు, బస్ స్టాప్ లలో మంచినీటిని ఏర్పాటుచేసి ప్రయాణికులకు అందుబాటులో ఉంచడంతో పాటు ఎమర్జెన్సి మెడికల్ టీం లను అప్రమత్తంగా ఉంచాలన్నారు. ఉపాధి, భవన నిర్మాణ పరిశ్రమలలో పనిచేసే కార్మికులు వడగాల్పుల సమయంలో పనులు చేయకుండా కార్మిక శాఖ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులు పనిచేసే ప్రదేశాలలో మంచినీరు,ఐస్ ప్యాక్ లను యాజమాన్యాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


వాతావరణ శాఖ ద్వారా ఎప్పటికప్పుడు అత్యధిక ఉష్ణోగ్రత వివరాలను ఎస్ ఎం ఎస్, వాట్సాప్ గ్రూప్ ల రూపంలో జిల్లా కలెక్టర్లు అధికారులు, మీడియాకు సందేశాలను పంపించాలన్నారు. అత్యధిక ఉష్టోగ్రత సమయంలో ప్రజలు చేయవలసింది, చేయకూడని అంశాలపై ప్రత్యకంగా ప్రచారం ఉండాలన్నారు. హీట్ వేవ్ అలర్ట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఐటి శాఖ వెబ్ సైట్  లో నమోదు చేసి అప్రమత్తం చేయాలన్నారు. జిహెచ్ఎంసి, అర్బన్ లోకల్ బాడీలకు సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్ళలో హీట్ వేవ్ వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. వేసవి సందర్భంగా మంచినీటి కొరత రాకుండా తగు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. వాతావరణ శాఖ ద్వారా అందించే సమాచారాన్ని ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని సి.యస్ కోరారు.ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, టి ఆర్ అండ్ బి ముఖ్యకార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశాంక్ గోయల్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ ముఖ్యకార్యదర్శి శ్రీ ఆర్.వి.చంద్రవదన్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ శివశంకర్, మెట్రోవాటర్ వర్క్స్ యం డి శ్రీ దానకిషోర్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానీయా, అడిషనల్ పిసిసిఎఫ్ రఘువీర్, ఐటి డైరెక్టర్ శ్రీ కె.దిలీప్ లతో పాటు వివిధ శాఖల  అధికారులు పాల్గొన్నారు.

Related Posts