YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

అటు రైతులు...ఇటు విద్యార్థులు పెట్టుబడులు, ఫీజుల టెన్షన్

అటు రైతులు...ఇటు విద్యార్థులు పెట్టుబడులు, ఫీజుల టెన్షన్

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

జూన్‌ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.. ఇదే నెలలోనే విద్యాసంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అటు స్కూల్‌ ఫీజులు, పుస్తకాలకు, ఇటు విత్తనాలు, ఎరువులు,
పురుగుల మందు కోసం డబ్బులు అవసరం అవుతాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాంలు, పెన్నులు, పెన్సిల్‌ ఇతరత్రా వస్తువుల ధరల విపరీతంగా పెరిగిపోయాయి. రెండు, మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది ఖర్చులను అంచనా వేయడం పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టంగా మారింది. జూన్‌ వస్తుందంటే చాలా మంది నెల రోజుల ముందు నుంచే లెక్కలతో కుస్తీ పడుతుంటారు. తమ వద్ద ఉన్న డబ్బు ఎంత... కావాల్సింది ఎంత... అప్పులు ఎన్ని తీసుకురావాలి.. ఎవరి వద్ద తీసుకురావాలి... అనుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే ఈ ఏడాది సదరు వ్యక్తుల అంచనాలు లెక్క తప్పుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.వీటన్నింటిని పిల్లలకు సమకూర్చలేక సామాన్య ప్రజానీకం సతమతం అవుతున్నారు. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది.ఈ నెల
12 నుంచి 2019–20 విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై విద్యార్థులు తల్లిదండ్రులు బేరీజు వేసుకుంటున్నారు. కొత్తగా పిల్లల్ని పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకునేవారు ఆయా ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలు బెంబెలెత్తించేలా వసూలు చేస్తున్న అడ్మిషన్, డొనేషన్‌ ఫీజులను చూసి సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఇదివరకే చదువుతున్న వారికి పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్, టై, షూ, వాటర్‌బాటిల్స్, లంచ్‌బ్యాగు, పుస్తకాల బ్యాగు తదితర వస్తువుల కొనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడనుంది. దీంతో ‘అమ్మో.. జూన్‌’ అంటూ తలపట్టుకుంటున్నారు. ఒకవైపు తమ పిల్లలకు ఏ పాఠశాలలో చేర్పించాలి.. ఆయా పాఠశాలల్లో ఏయే స్థాయి ఫలితాలు వచ్చాయి.. అక్కడి వాతావరణం, ఫీజులు తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులు విశ్లేషించుకుంటున్నారు. తమ ఆదాయ పరిమితి, చదువుకు ఖర్చు పెట్టేస్థాయి బేరీజు వేసుకుంటూ ఏ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించాలనే ఆలోచనలో కొందరు తలమునకలైతే..
ఇదివరకే చదువుతున్న పిల్లలకు ఈ యేడాది ఎంత ఖర్చు వస్తుందనే ఆలోచనతో మరికొందరు ఆందోళన చెందుతున్నారు. ఏటా రైతులకు వ్యవసాయం చేయడం కూడా భారంగా మారుతోంది. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండినా ధాన్యం డబ్బు చేతికి రాని దైన్య స్థితిలో రైతులు ఉన్నారు. వ్యవసాయ
పనులు అంతంతా మాత్రం. ఇతరత్రా కూలీ పనులు దొరుకక గ్రామీణ ప్రాంతాల్లోని జనం ఉపాధి పనులకు వెళ్లారు. ఆ పనుల కోసం వెళ్లిన ప్రజలకు గత నాలుగు మాసాలుగా ఉపాధి కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు సైతం అందకపోవడంతో గ్రామీణ ప్రజల పరిస్థితి గందరగోళంగా ఉంది. మండుతున్న ఎండల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రైతులు ఉపాధి పనులకు వెళ్లితే 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు దక్కలేదు. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌ సీజన్‌కు కావాల్సిన ఎరువులు, విత్తనాల కోసం కావల్సిన డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో సరిపడా రుణాలు లభించక రైతులు అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. పిల్లల చదువుల ఖర్చు వ్యవసాయ ఖర్చులు అంచనా వేయలేని స్థితి ఏర్పడడంతో పేద, మధ్య తరగతి కుటుంబీలకు తలలు పట్టుకుంటున్నారు.జిల్లా వ్యాప్తంగా సుమారు 700కు పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో వాటి విద్యాప్రమాణాలు, ఇతర అంశాలతో కూడిన స్థాయిని బట్టి రూ.10 వేల నుంచి మొదలుకుని రూ.లక్షకు పైగా ఏడాది ఫీజులున్నాయి. అందులోనూ ఐఐటీ, ట్యూషన్, సాంస్కృతిక, కరాటే తదితర అంశాలు నేర్పించేందుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ప్రైవేట్‌ విద్యాసంస్థలు వసూలు
చేస్తున్నాయి. వీటిలో కొన్ని తోకల పేరుతో 1వ తరగతికే రూ.లక్షల్లో వసూలు చేయడం విశేషం. నిబంధనలకు విరుద్ధంగా కొన్ని పాఠశాలలైతే అధిక ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఏదేమైనా మరో పది రోజుల్లో బడిగంటలు మోగనున్న నేపథ్యంలో తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అప్పు చేసైనా ప్రైవేట్‌ స్కూల్‌ అనేది వేళ్లూనుకుపోవడంతో దిగువ మధ్య తరగతి జనం కూడబెట్టుకున్న దానికి మరికొంత అప్పు చేసి పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. పుట్టగొడుగుల్లా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రైవేట్‌ విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. అందులో ఇంటర్నేషనల్, వరల్డ్, టెక్నో, ప్లేస్కూల్, డిజిటల్, టాలెంట్‌ ఇలాంటి వినూత్న పేర్లతో పాఠశాలలను నెలకొల్పుతున్నారు. తమ పాఠశాలలో అవి ఉన్నాయి.. ఇవి
ఉన్నాయంటూ ప్రచారంలో అద్భుతాన్ని చూపుతూ.. తమ పాఠశాలల్లో చదివితే ఏదో తెలియని జ్ఞానం వస్తుందనేలా సామాన్య జనాన్ని మభ్యపట్టే విధంగా ప్రచారం చేస్తున్నారు. దీని ఫలితంగా మధ్య
తరగతి కుటుంబాలు సైతం ఆకర్షితులై వారి పిల్లల్ని ఎంతటి కష్టమైనా ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.

Related Posts