ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కింద గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కిడిక్కడ నిలిచిపోయాయి. ఈ నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో సిసి రోడ్లతోపాటు ఆయా శాఖల ద్వారా చేపడుతున్న నిర్మాణపు పనులన్నీ ఆగిపోయాయి. ఆరు నెలల నుంచి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు విడుదల చేయకపోవడంతో రహదారులు, ప్రభుత్వ భవనాలు, పలు అభివృద్ధి పనులు పడకేశాయి. నిన్నమొన్నటి వరకు సార్వత్రిక ఎన్నికల కోడ్ వల్ల ఉపాధి పనులకు బ్రేకులు పడ్డాయని చెప్పుకొచ్చిన అధికారులు ఇప్పుడు అసలు విషయాన్ని బహిర్గతం చేస్తున్నారు. వాస్తవానికి సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందే ఉపాధి హామీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు నిలిపేశారు. ఉపాధి కూలీల సంబంధించిన బిల్లులు కూడా అరకొరగానే చెల్లిస్తున్నారు. మెటరియల్ కాంపొంనెంట్ కింద ఇసుక, సిమెంట్, మెటల్, ఇనుము వంటి సామగ్రి కొనుగోలు చేసి పూర్తి చేసిన పనులకు కేంద్రం ఒక్క రూపాయి కూడా విదల్చడం లేదు. జిల్లాలో 2019 జనవరి తర్వాత ఉపాధి హామీ పథకంలో భాగంగా కన్వర్జెన్సీ కింద చేపట్టిన రూ.130 కోట్లు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఆరు నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో ఇప్పటికే ప్రారంభించిన పనులు నిలిచిపోయాయి. మరికొన్ని మందకొడిగా సాగుతున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కొత్త పనులపై ఊసెత్తడం లేదు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోవడంతో కొత్తగా పనులు మంజూరైనా చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కన్వర్జెన్సీ కింద పెద్దఎత్తున సిమెంట్ రహదారులు, పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, మరుగుదొడ్లు, పశువుల శాలలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం తదితర పనులు చేపట్టారు. ఏజెన్సీలో ఉపాధి పథకం కింద చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పంట కాలువల తవ్వకం, రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. బిల్లులు సకాలంలో వస్తాయనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పనులు కానిచ్చేశారు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు చెల్లింపుల జరగకపోవడంతో అటు కాంట్రాక్టర్లు.ఇటు ఇంజినీరింగ్ అధికారుల్లో నిరుత్సాహం ఆవరించింది. దీంతో చాలా మండలాల్లో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోగా కొత్తగా ప్రారంభించాల్సిన పనులు ఎప్పుడు చేపడతారో తెలియని పరిస్థితి నెలకొంది. ఉపాధి హామీ కన్వర్జెన్సీ కింద కొత్త పనులు ప్రారంభం కావడం లేదని, తక్షణమే నిధులు విడుదల చేయాలని కేంద్రానికి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్నోమార్లు లేఖలు రాశారు. కానీ నిధుల విడుదల విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. దీంతో జిల్లాలో ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనుల పురోగతి ప్రశ్నార్థకమయ్యింది. గ్రామాల్లో ఉపాధి నిధుల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఈ పనులను చేపట్టేందుకు నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.