ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ సునామీ సృష్టించిన దెబ్బతో అధికార టీడీపీలోని అనేక మంది రాజకీయ మేధావులు సైతం మట్టి కరిచారు. గెలుపు గుర్రం ఎక్కడం కష్టమే అనుకున్న
నియోజకవర్గాల్లో సైతం జగన్ పార్టీ విజయం సాధించింది. అయితే, ప్రకాశం జిల్లా చీరాలలో మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న ఆమంచి కృష్ణమోహన్ మాత్రం పరాజయం పాలవడం సంచలనం
సృష్టించింది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీడీపీ నాయకురాలు పోతుల సునీతను ఘోరంగా ఓడించిన చరిత్రను సొంతం చేసుకున్నారు ఆమంచి. ఆ తర్వాత టీడీపీలోకి
వచ్చారు. అయితే, తన దూకుడు, రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు.2009లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య శిష్యుడిగా ఎంట్రీ ఇచ్చి గెలిచిన ఆమంచి ఆ తర్వాత గత ఎన్నికల్లో చీరాల నవోదయం పార్టీ తరపున ఇండిపెండెంట్‌గా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో స్థానికంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఆయన బలవంతంగానే టీడీపీలో జాయిన్ అయ్యారు. అయితే, టీడీపీలోని కీలక నేతలతో కలిసి పనిచేయలేని పరిస్థితిని ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఆమంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ టికెట్‌పై విజయం సాధించడం ఖాయమని అనుకున్నారు. అయితే, ఆ మంచిని ఎలాగైనా ఓడించాలనే కసితో పావులు కదిపిన చంద్రబాబు.. టీడీపీ టికెట్‌ను రాజకీయ వృద్ధుడు కరణం బలరాంకు ఇచ్చారు. వాస్తవానికి ఈయన రాజకీయాలకు ఇక బై చెప్పే స్టేజ్‌లో ఉన్నారని అందరూ అనుకున్నారు. రాజకీయాల్లో ఈయన ఏం గెలుస్తాడు అనుకున్నారు. అంతేకాదు, ఆమంచి వంటి దూకుడున్న నాయకుడిని ఓడించడం కష్టమేనని లెక్కలు వేసుకున్నారు.అయితే, అనూహ్యంగా ఇంత పెద్ద పెట్టున వచ్చిన జగన్ సునామీలోనూ ఆమంచి ఓటమిపాలయ్యారు. ఇక, రాజకీయాలకు దూరం అవుతాడని అందరూ భావించిన కరణం మాత్రం విజయం సాధించారు. ఇంత గాలిలోనూ చీరాలలో ఆమంచి ఓడిపోవడం వెనక ఆయన స్వయంకృతాపరాధమే కారణం. దూకుడు రాజకీయాలతో పాటు చీరాలలో బలంగా ఉన్న సామాజికవర్గాలను దూరం చేసుకోవడం.. ఎవ్వరిని లెక్క చేయకపోవడం ఆయనకు మైనస్ అయ్యాయి. దీంతో ఇక, ఆమంచి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనే విషయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.కాపు వర్గానికి చెందిన ఆమంచి గెలిచి ఉంటే జగన్ ఖచ్చితంగా తన మంత్రి వర్గంలో చోటు కల్పించి ఉండేవారు. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన ఆమంచికి మూడోసారి కూడా
గెలిస్తే ఆయన కోరుకున్నట్టు మంత్రి అయ్యేవారు. ఇప్పుడు స్వయంకృతాపరాధంతోనే రాజకీయంగా వెనకపడిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. అయితే, ఆయన ఓడిపోవడం, ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు ఏ నామినేటెడ్ పదవిని కట్టబెట్టాలన్నా కూడా జగన్‌కు కష్టమే అవుతుంది. ఇక, ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం కూడా తక్కువగానే ఉందని అంటున్నారు. దీనికి కారణం ప్రకాశం జిల్లాలో సీటు వదులుకున్న బూచేపల్లి సుబ్బారెడ్డి, గొట్టిపాటి భరత్ లాంటి వాళ్లకు ఇప్పటికే ఎమ్మెల్సీపై జగన్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మరో ఐదేళ్ల వరకు కూడా ఆమంచి పొలిటికల్ కష్టాలు ఎదుర్కొనవలసిందే అంటున్నారు పరిశీలకులు