గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు నడుస్తున్న సర్వీసులు త్వరలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. సింగపూర్‌కు సర్వీసులను నడుపుతున్న ఇండిగో విమానయాన సంస్థ జూన్ నెలాఖరు వరకే టిక్కెట్ల విక్రయాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థతో ఇండిగో చేసుకున్న ఒప్పందం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. వయబులిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో ఇండిగో సంస్థతో చంద్రబాబు సియంగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని అంతర్జాతీయ సర్వీసులను గన్నవరం నుంచి ఆరంభించింది. వారంలో మంగళ, గురువారాలు రెండు రోజులు సింగపూర్- విజయవాడ, విజయవాడ- సింగపూర్ సర్వీసులు నడుస్తున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను ఇచ్చి రెండేళ్లయినా సర్వీసులు మొదలుకాక పోవడంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రైవేటు విమానయాన సంస్థలను వీజీఎఫ్ విధానం కింద ఆహ్వానించింది.ఏపీఏడీసీఎల్ ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించి ఇండిగోను ఎంపిక చేసింది. వీజీఎఫ్ విధానం ప్రకారం.. సింగపూర్‌కు నడిపే విమాన సర్వీసులకు 65శాతంకంటే తక్కువ టిక్కెట్లు విక్రయమైతే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం కుదిరింది. ఏపీఏడీసీఎల్, ఇండిగో సంస్థల మధ్య ఆరు నెలలకు తొలుత ఒప్పందం కుదిరింది. 2019 మేతో ఒప్పందం ముగుస్తుండగా.. ఎన్నికలకు ముందే మరో నెల రోజులకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. తాజాగా మళ్లీ ఒప్పందం పొడిగింపునకు ఏపీఏడీసీఎల్ అధికారులు ఫైల్ ని ప్రభుత్వానికి పంపారు. దీనిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొడిగింపు సమాచారం తమకు లేకపోవడంతో టిక్కెట్ల విక్రయాన్ని ఆపేసినట్టు ఇండిగో ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.గన్నవరం విమానాశ్రయం నుంచి నడిచే ఏకైక అంతర్జాతీయ సర్వీసులు ఇవే. గత డిసెంబరు 4 నుంచి ఆరంభమైన సింగపూర్ సర్వీసులకు ప్రయాణికుల ఆదరణ ఉంది. ఇండిగో సంస్థ 180 సీటింగ్ సామర్థ్యం ఉన్న ఏ320 ఎయిర్‌బస్‌లను నడుపుతోంది. గత ఆరు నెలల్లో ఫిబ్రవరి, మార్చిలో తప్ప మిగతా రోజుల్లో చాలావరకూ 70 నుంచి 95శాతం ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్) నమోదవుతోంది. విజయవాడ నుంచి కేవలం నాలుగు గంటల్లో సింగపూర్‌కు చేరుకునేందుకు ఈ సర్వీసులు దోహదపడుతున్నాయి. అక్కడినుంచి ఏ దేశానికైనా సులభంగా చేరుకునే అవకాశం ఉన్నందున ఆదరణ పెరుగుతోంది. టిక్కెట్ ధరలు సైతం రూ.7,500 నుంచి రూ.10,422గా నిర్ణయించడంతో సింగపూర్ పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది.