విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లు రాజకీయ దుమారం రేపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నానీ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇటీవల.. లోక్‌సభలో తెదేపా విప్, ఉపనేత పదవుల్ని తిరస్కరిస్తూ నాని చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. తాను అంత పెద్ద పదవులు నిర్వహించలేనని, మరొకరికి ఇవ్వాలని తన ఫేస్‌బుక్ ఖాతాలో వ్యంగ్యంగా పోస్టు చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. అనంతరం తెదేపా అధిష్ఠానం రంగంలోకిదిగి పరిస్థితి చక్కదిద్దింది.
ఆ తరువాత ‘కొడాలి నాని తనని మంత్రిని చేసిన దేవినేని ఉమాకి జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలి’ అంటూ గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)పై ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. అసలు
కేశినేని ఎందుకిలా పోస్టు చేశారన్న దానిపై టీడీపీతో పాటు... వైసీపీలో కూడా నేతలు చర్చించుకున్నారు. దీని వెనుక కేశినేని అసలు టార్గెట్ ఏంటన్న దానిపై మాట్లాడుకున్నారు.
తాజాగా ఫేస్‌బుక్‌లో పెట్టిన మరో పోస్టు దుమారం రేపుతోంది. ‘‘ నేను స్వయం శక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయా దాక్షిణ్యాలమీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్దాన్ని అబద్దమనే చెబుతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన వాడిని. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నారక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు’’ అని పోస్టు చేశారు. కేశినేని ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నదానిపై రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనడుస్తోంది.