మార్పు తెస్తానంటూ పాలిటిక్స్ లో ప్రవేశించిన పవన్ కల్యాణ్ కు తత్వం బోధ పడింది. చేదు వాస్తవాలు ఒక్కటొక్కటిగా వంటపడుతున్నాయి. రాజకీయమంటే ఎత్తు పైఎత్తుల చదరంగం. చినచేపను పెద చేప మింగేసే కపటనాటక విన్యాసం. ‘ఓట్లు అమ్ముకోవద్దు. ఓట్లు కొనుక్కోవద్దు’వంటి సూక్తులు ఎవరి చెవికీ ఎక్కవు. ఎవరూ పట్టించుకోరు. ఖర్చు పెట్టగల సామర్ధ్యం ఉన్న కొందరు నేతలు సైతం జనసేనలో చేతులు కట్టేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఘోరపరాజయం ఎదురైంది.దీనిని తిప్పికొడతానంటూ పవన్ తాజాగా చెబుతున్నారు. తన ఓటమికి 150 కోట్లు ఖర్చు పెట్టారంటూ సంచలన ఆరోపణ చేస్తున్నారు. ఆధారాలు చూపకపోయినప్పటికీ అసలు విషయం ఆయగ్రహించినట్లున్నారు. అంతగా డబ్బులు రాజ్యం చేస్తుంటే ప్రజాస్వామ్యంలో పైసలు లేకుండా పదవులు దక్కుతాయా? తన రాజకీయాల సత్తా ప్రత్యర్థులకు రుచి చూపిస్తానంటున్న పవన్ కల్యాణ్ తన పంథా మార్చుకుంటారా? లేక తన దారిలోకే ప్రత్యర్థులను తేగలనన్న నమ్మకం ఆయనకు కుదిరిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాడర్ లో నైతిక స్థైర్యం నింపడానికే ఈ వ్యాఖ్యలు చేశారనే వారికీ కొదవ లేదు. ఏదేమైనప్పటికీ పవన్ మార్కు మార్పు కోణంలో మార్పు వస్తోందా?అన్న చర్చ
మొదలైంది.జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ రంగంలోకి దిగిన జనసేన ఆశించిన స్థాయి విజయాలు సాధించలేకపోయింది. అయితే ప్రధానపార్టీలతో పోలిస్తే నిధులను విచ్చలవిడిగా వినియోగించలేదన్న మంచి పేరు మాత్రం తెచ్చుకుంది. కానీ రాజకీయాల్లో మంచి తనం కంటే విజయం ముఖ్యం. పార్టీ వైఫల్యాలకు కారణాలను అన్వేషించే క్రమంలో భాగంగా అంతర్గత సమీక్షలు ప్రారంభించారు పవన్ కల్యాణ్. ఇంతవరకూ తన ఆశయాలను మాత్రమే చూశారని, ఇకపై తన రాజకీయాలు చూస్తారంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మార్పు కోసం రంగప్రవేశం చేశానన్న సంప్రదాయ రాజకీయాల వైపు మళ్లుతారా? పొలిటికల్ వ్యూహాలు, ఎత్తుగడల గురించి మాట్లాడటం వెనక ఉద్దేశాలేమిటి? మనీ మేక్స్ ఎవిరీ థింగ్ అన్నట్లుగా మారిన నేటి పాలిటిక్స్ లో జనసేన పునరుత్థానం పొందగలుగుతుందా? అంటే సమాధానం దొరకడం కష్టమే. ఆశయం వేరు. ఆచరణ వేరు. క్లీన్ పాలిటిక్స్ అంటూ సిద్ధాంతాలు వల్లె వేసినంత మాత్రాన రాజకీయాలు పరిశుద్ధం కావు.
దీనిని గ్రహించిన పవన్ కల్యాణ్ తాను సైతం స్థానిక రాజకీయాలకు అవసరమైన వ్యూహాలను అనుసరిస్తానని ప్రకటించారు. అంటే ప్రత్యర్థుల ఎత్తుగడలను పరిశీలించి ప్రతివ్యూహాలతో ముందుకు
వెళతామనేది ఆయన సమీక్షల సారాంశంగా చెప్పుకోవాలి.శాసనసభ ఎన్నికల్లో 6.7 శాతం ఓటు షేరుకే పరిమితమై జనసేన చతికిలపడింది. ఒక్క స్థానం గెలుపుతో శాసనసభలో కనీస ప్రాతినిధ్యం
మాత్రమే దక్కింది. పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమితో మొత్తం పార్టీ నిర్వీర్యమైపోయింది. నిరంతరం ప్రజల్లో ఉండకుండా అప్పుడప్పుడూ మాత్రమే కనిపించే నేతగా ముద్ర పడటమూ, పార్టీ
గెలుపు సాధిస్తుందనే నమ్మకం లేకపోవడమూ, తెలుగుదేశంతో అంతర్గత అవగాహన ఉందనే అనుమానం వెరసి జనసేన వైఫల్యానికి దారితీశాయనేది ఒక విశ్లేషణ.