యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ అసెంబ్లీ చరిత్ర తిరగేస్తే కొన్ని ఆసక్తికరమైన పేజీలు కనిపిస్తాయి. ఎందరో ఉద్దండులు ఆంధ్రప్రదేశ్ ని పాలించారు. తమదైన ముద్రను పాలనాపరంగా వేశారు. మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైన తరువాత తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గొప్ప బాధ్యత తీసుకున్నారు. ఆ తరువాత నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, చెన్నారెడ్డి, అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి హేమాహేమీలు ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సినీ రంగం నుంచి హఠాత్తుగా నేలకు దిగి సామాన్యుడిలో అసమాన్యుడిగా నిలిచి జనం మనసు గెలిచిన అన్న నందమూరి తారకరామారావు ఉత్తుంగతరంగంలా ఆంధ్రప్రదేశ్ లో ప్రభంజనం సృష్టించి ప్రజా ముఖ్యమంత్రి అయ్యారు.ఇక ఎన్టీయార్ రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత 1989 ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు. ఆయన ప్రతిపక్ష నాయకుని హోదాలో అసెంబ్లీలో రెండేళ్ళ పాటు చర్చల్లో పాలుపంచుకున్న అప్పటి కాంగ్రెస్ సభ్యుల విమర్శలు తట్టుకోలేక మీరున్న అసెంబ్లీకి రాను అంటూ రాం రాం అనేశారు. తిరిగి ముఖ్యమంత్రిగానే 1994లోఎన్టీఆర్ అసెంబ్లీకి వెళ్ళారు. ఆ విధంగా ఆయన తన పంతం నెగ్గించుకున్నారు. ఎన్టీఆర్ ఆ విధంగా చేయడానికి స్పూర్తి అప్పటికి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత. ఆమె అంతకు ముందు విపక్షంలో ఉండగా అసెంబ్లీలో జరిగిన అవమానంతో తమిళ సభకు గుడ్ బై కొట్టారు. డీఎంకే అధికారంలో ఉండగా సభలో అడుగుపెట్టనని జయలలిత శపధం చేశారు.ఇక జగన్ విషయానికి వస్తే ఆయన కూడా మూడేళ్ళ పాటు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరయ్యారు. అయితే టీడీపీ నుంచి విపరీతమైన విమర్శలు, మితిమీరి వ్యక్తిగత దూషణలు జగన్ భరించలేకపోయారు. ఇక అదే విధంగా తన వెంట ఉన్న వారిని సైతం అధికార పార్టీలోకి జంప్ చేయించి వారినే మంత్రులుగా తన కళ్ళెదుట నిలబెట్టడాన్ని జగన్ సహించలేకపోయారు. ఈ పరిణామాలతో కలత చెందిన జగన్ 2017 బడ్జెట్ సమావేశాల తరువాత సభకు నమస్కారం అనేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న సభలో తాను అడుగుపెట్టబోనని కూడా ఖరాఖండీగా చెప్పేశారు. ఇపుడు తన పంతం నెగ్గించుకుని బంపర్ మెజారిటీతో జగన్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఓ విధంగా జగన్ అన్న ఎన్టీయార్ బాటాలో నడిచారని చెప్పాలి. జయలలిత, ఎన్టీయార్ , జగన్ ఈ ముగ్గురూ కూడా తిరుగులేని ప్రజాదరణ చూరగొన్న నేతలు కావడం మరో విశేషం.