యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం షీలా దీక్షిత్ భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మహానగరంలో ప్రజల విద్యుత్, నీటి సమస్యలపై చర్చించేందుకే షీలా దీక్షిత్ నేతృత్వంలో పార్టీ నేతల బృందం అర్వింద్ కేజ్రీవాల్‌ను కలిసినట్లు భేటీ తర్వాత కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. అయితే ఈ భేటీ వెనుక రాజకీయం ఉందని బీజేపీ నేతలు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు చర్చల్లో భాగంగానే ఈ భేటీ జరిగిందని చెబుతున్నారు.మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాలనూ బీజేపీ కైవసం చేసుకుంది. చివరి వరకూ ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు పార్టీలో విడివిడిగా పోటీ చేశాయి. త్రిముఖ పోటీలో బీజేపీ ఢిల్లీలోని అన్ని స్థానాలల్లోనూ విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీకి షెడ్యూల్ మేరకు వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి చెక్ పెట్టవచ్చన్న అభిప్రాయం ఇరు పార్టీల నేతల్లో వ్యక్తమవుతోంది. అర్వింద్ కేజ్రీవాల్‌తో షీలా దీక్షిత్ భేటీ కావడం ఈ దిశగా పడిన తొలి అడుగుగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటున్న కాంగ్రెస్, దీనికి సంబంధించి ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. 70 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున జాబితాను సిద్ధం చేయాలని పార్టీ శ్రేణులను షీలా దీక్షిత్ ఆదేశించినట్లు తెలుస్తోంది.