యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొత్త స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాంకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ఇదే శాసన సభలో విలువల్లేని రాజకీయాలు చూశామన్నారు. ప్రతిపక్ష నేతను
మాట్లాడనివ్వని రాజకీయాలు చూశామన్నారు. తాను కూడా అలాగే చేస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదన్నారు. చట్టసభలపై అవగాహన ఉన్న వ్యక్తిని స్పీకర్గా ఎంపిక చేశామని జగన్ స్పష్టం
చేశారు. టీడీపీ హయాంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులను చేశారని.. పార్టీ మారినవారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ ప్రస్తావనకు తెచ్చారు. స్పీకర్ ఎలా ఉండకూడదో గత సభలో చూశామని అయితే స్పీకర్ అంటే ఎలా ఉండాలో ఇప్పుడు చూపిస్తామని జగన్ అన్నారు. చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చూసేందుకు కొందరు ఎమ్మెల్యేలను లాగేద్దామని పార్టీ నేతలు కొందరు చెబితే తాను అంగీకరించలేదన్నారు.పార్టీ ఫిరాయింపుల అంశంపై అయన చంద్రబాబుపై మండిపడ్డారు. "దేవుడు గొప్ప స్క్రిప్ట్ రాశాడు. దానికి ఏపీ ఎన్నికలే నిదర్శనం. ఎమ్మెల్యేలను కొన్న వారికి అక్షరాలా 23 సీట్లు వచ్చాయి. ముగ్గురు ఎంపీలను కొన్నవారికి మూడే సీట్లు వచ్చాయి. అది కూడా 23వ తారీఖున అని వ్యాఖ్యానించారు.