యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాబోయే స్థానిక ఎన్నికలు జనసేనకు అసలు సిసలు పరీక్ష పెట్టబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా పార్టీ నిర్మాణం ఇప్పుడైనా పటిష్టం గా చేయాలన్నది జనసేన యోచన. ఈ మేరకు ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలంటు పిలుపునిచ్చారు. అయితే ప్రజల్లో ఇమేజ్ వున్న పార్టీ నుంచి పోటీ చేయడానికే బలమైన అభ్యర్థులు ప్రయత్నం చేస్తారు. అందులోను అధికారపార్టీ నుంచి అయితే మరి హుషారుగా టికెట్ కోసం చివరిదాకా పోరాడతారు. అక్కడ బెర్త్ దొరక్కపోతే ప్రతిపక్షం వైపు చూస్తారు. ప్రస్తుతం ఏపీలో టిడిపి కూడా మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడినా చంద్రబాబు కు వున్న ఇమేజ్, బలమైన క్యాడర్ తెలుగుదేశానికి వరం. దాంతో స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలకోసం పెద్దగా పసుపు పార్టీ కిందా మీదా పడాలిసిన అవసరం లేదు.అధ్యక్షుడే ఓడిపోయిన పార్టీగా జనసేన మరి నీరసంగా ప్రజల ముందుకు ఓట్లు అడిగేందుకు వెళ్ళాలి. దాంతో పార్టీపై అభిమానంతో త్యాగాలకు సిద్ధపడే వారు ముందుకు రావాలి. అయితే లక్షలాదిమంది అభిమాన జనం వెంట ఉన్నారన్న ధైర్యంతో తనంటే పడిచచ్చేవారికే ఈసారి పవన్ టికెట్లు కేటాయించే ప్లాన్ లో వున్నారు. వారు ఎవరైంది గుర్తించే పని ఇప్పటినుంచి ఆయన టీం మొదలు పెట్టేసింది. యుద్ధంలోకి దిగాకా చావో రేవో తేల్చుకునేందుకు పవన్ సీరియస్ గా ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నారు.సమస్య వచ్చినప్పుడే మనతో ఎందరు ఉన్నారన్న లెక్కే వాస్తవమని తన సిద్దాంతాలు ఆశయాలు నమ్మి మిగిలిన వారితో కదన క్షేత్రంలో పోరాడతామని ఇప్పటికే తేల్చేశారు. అయితే స్థానిక ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా వున్నా సొంత బలం గ్రామాల వారీగా పవన్ కి అర్ధం అవ్వడంతో బాటు పార్టీ నిర్మాణం నిఖార్సైన జనంతో సాగుతుందని ఆయన ఆశిస్తున్నారు. అందుకే ఎన్ని రిస్క్ లైనా భరించి ముందుకే వెళ్లాలని పికె తీసుకున్న నిర్ణయం జనసేనకు వెలుగులు పంచుతుందా ? చీకట్లోనే ఉంచుతుందా ? అన్నది వేచి చూడాలి