భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మెత్తబడ్డారా? లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చి పక్షం రోజులు దాటడంతో ఆయన ఆలోచనల్లో కొంత మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పదిరోజుల్లో కాంగ్రెస్ కు నూతన అధ్యక్షుడిని నియమించుకోవాలని కూడా ఆయన సీనియర్ నేతలకు సూచించారు.దీంతో కాంగ్రెస్ లో అయోమయం నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై ఊహాగానాలు కూడా చెలరేగాయి. ఏకే ఆంటోని, చిదంబరం, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ చివరకు సోదరి ప్రియాంక గాంధీ కూడా రాహుల్ కు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. రాజీనామా ఆలోచనను వెనక్కు తీసుకోవాలని వారు సూచించినా రాహుల్ ససేమిరా అన్నారు. దీంతో ఒకదశలో కొత్త పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.కానీ గతకొద్ది రోజుల నుంచి రాహుల్ పర్యటనలు ప్రారంభించారు. ఇటీవల తాను విజయం సాధించిన కేరళలోని వయనాడ్ లోనూ పర్యటించారు. రాహుల్ గాంధీ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కన్పిస్తోంది. గెలుపోటములు సహజమేనని, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తనపై ఉందని రాహుల్ గుర్తించినట్లు కన్పిస్తోంది. లోక్ సభలో పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియాగాంధీ ఎన్నిక, ఆ తర్వాత సీనియర్ నేతలు నచ్చజెప్పడంతో రాహుల్ కూల్ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, జమ్మూ,కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికలు జరుగుతుండటంతో ఈ సమయంలో పదవి నుంచి తప్పుకోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో తప్పుడు సంకేతాలను పంపుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజీనామా ప్రభావం పనిచేస్తుందని భావించిన రాహుల్ కొంత వెనక్కు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ ఏఐసీీసీ అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రకటించడం కూడా ఆయన ఆలోచనకు అనుగుణంగానే జరిగిందంటున్నారు. మొత్తం మీద రాహుల్ కూల్ అయ్యారట.