ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు మధ్య మాటల యుద్ధం నెలకొంది. స్పీకర్ ఎన్నిక అనంతరం వైఎస్ జగన్ గతంలో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయం గురించి మాట్లాడారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రస్తావన తీసుకురాగా.. మరోవైపు వైఎస్ జగన్ కూడా దివంగత నేత నందమూరి తారకరామారావు ప్రస్తావనకు తెచ్చారు. చంద్రబాబు ఏమన్నారంటే... అడుగడుగునా ప్రతిపక్షాన్ని సీఎం కించపర్చారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. జగన్ తండ్రి వైఎస్ నాలుగు రోజుల్లోనే పార్టీ మారారు. జగన్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ తప్పు చేశారని ఒప్పుకుంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే వైఎస్ పేరు ప్రస్తావనపై చంద్రబాబు ప్రసంగానికి వైసీపీ సభ్యులు అడ్డుతగిలారు.
వీడియోలు చూపించమంటారా..!
హత్యలు చేసినవాడిని హత్య చేయడం తప్పుకాదన్నట్టుగా చంద్రబాబు తీరు ఉంది. గతంలో విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబు తప్పును ఒప్పుకోకుండా అనవసర విషయాలు చెబుతున్నారు. చంద్రబాబు మాటలు వింటే ఆశ్చర్యంగా ఉంది. అవకాశం ఇస్తే చంద్రబాబు గురించి ఎన్టీఆర్ చెప్పిన మాటలను సభలో వినిపిస్తానని చంద్రబాబుకు జగన్ కౌంటర్ ఇచ్చారు.