YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తుఫాను ప్రభావం...

తుఫాను ప్రభావం...

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తుఫాను వాయు ప్రభావం కారణంగా 77 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెలువరించారు. పశ్చిమ రైల్వే మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికుల కోసం భద్రతా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. సహాయ చర్యలకు రెండు రైళ్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు వెల్లడించారు. రాజ్‌కోట్ డివిజన్, భావ్‌నగర్ డివిజన్ ప్రాంతంలో ఈ రైళ్లు నడవనున్నట్లు పేర్కొన్నారు.తుఫాన్ కారణంగా మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు చెప్తున్నారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు పెను తుఫాన్‌గా మారి.. గుజరాత్ తీరం దిశగా కదులుతున్నది. వాయు కొద్దిగా దిశను మార్చుకుని శుక్రవారం మధ్యాహ్నం దక్షిణాన ఉన్న వెరావల్ నుంచి పశ్చిమాన ఉన్న ద్వారక మధ్య ఎక్కడైనా తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం పేర్కొన్నది. దీని ప్రభావంతో గాలిలో తేమ తగ్గి నైరుతి రుతుపవనాల కదలిక మందగమనంలో సాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం కేరళ నుంచి తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించిన రుతుపవనాలు ఈ నెల 16 లేదా 17న తెలంగాణలో విస్తరించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 17న తొలకరి వానలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత మళ్లీ పెరిగింది. వాయు తుఫాన్ కారణంగా గాలిలో తేమశాతం తగ్గి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మరో రెండ్రోజులపాటు వడగాడ్పుల తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఈశాన్య బంగాళాఖాతం, దానిని అనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీని ప్రభావంతో శుక్రవారం కొన్నిచోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.గురువారం రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, కరీంనగర్‌లో 44 డిగ్రీలు, మహబూబాబాద్‌లో 43.7 డిగ్రీలు, హైదరాబాద్‌లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Related Posts