YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంత్రులు 9.30 కు ఆఫీసుకు వచ్చేయండి

మంత్రులు 9.30 కు ఆఫీసుకు వచ్చేయండి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

భారీ మెజార్టీతో భారత ప్రధానిగా రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ప్రజలు ఇచ్చిన గౌరవం మేరకు పాలనలో కొత్తదనం చూపెట్టడానికి సిద్ధమయ్యారు. ఉదయం 9.30 గంటలకల్లా కార్యాలయాలకు రావాలని మంత్రులందరికీ సూచించారు. అదేవిధంగా ఇంటి నుంచి పనులను చక్కబెట్టడం మానుకోవాలని చెప్పారు. తద్వారా ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇతర కార్యకలాపాలు, పర్యటనలేవీ పెట్టుకోవద్దని మంత్రులు, ఎంపీలకు సూచించారు. ఎన్ని పనులున్నా పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. రెండోసారి ప్రధాని అయ్యాక తొలిసారి మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. క్రమ శిక్షణతో ఉంటేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారని చెప్పారు.తాను గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కార్యాలయానికి క్రమం తప్పకుండా సమయానికి వెళ్లేవాడినని ప్రధాని మోదీ తెలిపారు. తద్వారా చాలా మార్పులు గుర్తించానని వివరించారు. తాను సమయానికి రావడంతో అధికారులు అంతకంటే ముందే ఆఫీసుకు వచ్చేవారని.. ఆ రోజు చేయాల్సిన పనులనుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధం చేసి వాటిని సకాలంలో పూర్తి చేసేవారని మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ కొత్త సంప్రదాయాలు నెలకొల్పాలని మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ఎంపీలకు తగిన సమయం కేటాయించాలని చెప్పారు. మంత్రులకు, ఎంపీలకు పెద్దగా తేడా లేదని చెప్పారు. తన దృష్టిలో అందరూ సమానమేనని తెలిపారు. మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడానికి సమయం వెచ్చించాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. సహాయ మంత్రులు కూడా ప్రభుత్వ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించాలన్న మోదీ సూచించారు. ముఖ్యమైన ఫైళ్లపై అభిప్రాయాన్ని సహాయ మంత్రులతో పంచుకోవాలని మంత్రులకు సూచించారు. ఇలా చేయడం వల్ల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు, ఫైళ్లను త్వరగా ఆమోదించేందుకు వీలవుతుందని తెలిపారు. అయిదేళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించిన ఎజెండా, మొదటి100 రోజుల కార్యాచరణకు సంబంధించి ప్రతి మంత్రిత్వ శాఖ స్వయంగా ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. వాటిని పూర్తి చేయడమే అజెండాగా పనిచెయ్యాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను మంత్రులకు వివరించారు. తొలి కేబినెట్ సమావేశంలో ప్రధాని మోదీ ‘పీఎం కిసాన్’ పథకాన్ని విస్తరించే ఫైలుపై సంతకం చేశారు. దీని ద్వారా రైతులందరికీ ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందునుంది. 

Related Posts