ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుని ‘బంట్రోతు’ అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ఎంతగా నచ్చచెప్పినా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు క్షమాపణలు చెప్పాలని కోరడంపై ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. గత ఐదేళ్లలో టీడీపీకి చెందిన శాసనసభ్యులు మాట్లాడిన మాటలకు వాళ్లు ఎన్ని గుంజీలు తీసి, లెంపకాయలు వేసుకున్నా కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పాటైన తొలి శాసనసభలో కాల్ మనీ సెక్స్ రాకెట్ ద్వారా మహిళలను వ్యభిచార కూపంలోకి దింపుతున్న వ్యవహారంపై ఇదే అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన తన నోరు నొక్కడానికి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోవడం కోసం స్పీకర్ స్థానాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఏడాది పాటు తనను సస్పెండ్ చేయడం న్యాయమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులు న్యాయం, సంప్రదాయాల గురించి మాట్లాడతారా అంటూ నిప్పులు చెరిగారు.