యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్రంలో రెండో సారి కూడా అధికారంలోకి వస్తామని, రావడం తథ్యమని చెప్పుకొన్న టీడీపీ అధికారానికి దూరమైంది. అత్యంత ఘోరంగా ఎన్నికల్లో పరాజయం పాలైంది. కనీసం మర్యాదపూర్వకమైన సీట్లలో కూడా గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. నిజానికి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, అనుభవం అంటూ ఊదరగొట్టుకున్న పార్టీకి ఇప్పుడు విశ్లేషణలు తప్ప మిగిలింది ఏమీలేదు. పైగా 80% సంతృప్తి, 85% సంతృప్తి అంటూ లెక్కలు వేసుకున్నా.. చివరికి అవన్నీ చెత్తకుప్పల్లోకే తరలిపోయాయి. దీంతో ఇప్పటికే తీవ్ర నిరాశలో కూరుకుపోయిన టీడీపీ వచ్చే 2024 నాటికైనా పుంజుకుని పైకిలేవాలని నిర్ణయించుకుంది. అయితే ఇంతలోనే గోరు చుట్టుపై రోకలి పోటు పడింది!తాజాగా ఏపీ పగ్గాలు చేపట్టిన వైసీపీ అధినేత జగన్.. తన పాలనకు పదిరోజులు కూడా పూర్తికాక ముందుగానే ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయన తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నా యి. అసలు జగన్ కు పరిపాలన చేతనవుతుందా?. అనుభవం ఉందా? ఆయనకు ఒక్క ఛాన్స్ మాత్రం ఎందుకు ఇవ్వాలి ? ఆయన అధికారం ఇస్తే.. రాష్ట్రంలో అరాచకమే! అంటూ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు తో సహా తమ్ముళ్లు పెద్ద ఎత్తున గొంతు చించుకున్నారు. అయితే, ప్రజలు వీటిని విశ్వసించలేదు. జగన్‌కే మెజారిటీ మార్కు కట్టబెట్టి గెలిపించారు.తాజాగా జగన్ ఏపీ పగ్గాలు చేపట్టి పట్టుమని పది రోజులు మాత్రమే గడిచింది. పైగా కేబినెట్‌ను ఏర్పాటు చేసుకుని రెండు రోజులు మాత్రమే జరిగింది. ఈ అత్యంత స్వల్ప సమయంలో జగన్ తీసుకున్న నిర్నయాలే, వేస్తున్న అడుగులు ఇప్పుడు విపక్షంలో కూర్చున్న చంద్రబాబు అండ్ తమ్ముళ్లకు నిద్రపట్టనివ్వడంలేదు. నిర్ణయాల్లో ఎక్కడా తాత్సారం లేకుండా, ఎక్కడా తడబాటు పడకుండానే జగన్ వ్యవహరిస్తున్నారు. మంత్రి వర్గ కూర్పు నుంచే తనేంటో చూపించిన జగన్.. పాలన పరంగా వేస్తున్న అడుగులు ప్రజల్లో చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా అవ్వతాతల పింఛన్‌ను రూ.2250కి పెంచడం, ఆశావర్కర్ల వేతనాలను రూ.10వేలకు పెంచడం వంటి సంచలన నిర్ణయాలు ఆయన రేంజ్‌ను అమాంతం పెంచాయి.ఇక, తాజాగా ఆర్టీసీ విలీనం ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఇది ఓకే అయితే, ఇక, రాష్ట్రంలో జగన్ కు తిరుగు ఉండద ని అంటున్నారు. అదేసమయంలో ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న సీపీఎస్ రద్దు దిశగా కూడా జగన్ అడుగులు వేస్తు న్నారు. ఇది కేంద్రానికి సంబంధించేదే అయినా.. జగన్ తన నిర్ణయంతో ఉద్యోగుల సమస్య పరిష్కరించేందుకు రెడీ అయ్యారు. ఇది కూడా జగన్‌కు మెజారిటీ ప్లస్‌గా మారుతుంది. గ్రామాల్లో 4 లక్షల మంది వాలంటీర్ల నియామకం, గ్రామ సచివాలయాల్లో 1.6 లక్షల మంది ఉద్యోగుల నియామకం వంటి వాటికి కూడా జగన్ తెరదీశారు. ఈ పరిణామాలను గమనిస్తున్న చంద్రబాబు.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలాంటి నిర్ణయాలు, నియామకాలు మనం ఎప్పుడైనా చేశామా? అని రికార్డులు పరిశీలించుకుంటున్నారట. ఇక, జగన్ దూకుడు గమనించిన నాయకులు ఐదేళ్లు కాదు.. మనం పదేళ్లు ప్రతిపక్షంలోనే ఉండాల్సి ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట.