యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఉదయం అనంతతేజోమూర్తి అయిన శ్రీనివాసుడు చిన్నశేష వాహనంపై శ్రీ బద్రీనారాయణుడి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
రెండో రోజు ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనంపై ఊరేగుతారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతికప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందునివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కన్పించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించేశక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్ఫలాలు తొలగి, భక్తులు కల్యాణప్రదులై, సుఖశాంతులతో ఆనందజీవులతారు.
అనంతరం ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో
అభిషేకం చేపట్టారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు ఊంజల్సేవ ఘనంగా జరుగనుంది. రాత్రి 8.00 గంటల నుండి 9.00 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు వీణ ధరించి సరస్వతీరూపంతో భక్తులను అనుగ్రహంచనున్నారు. సారం లేనిదాన్ని వదలి, సారవంతమైన దాన్ని స్వీకరించే ఉత్తమజ్ఞానానికి హంస సంకేతం. జ్ఞానరూప పరమహంస అయిన కల్యాణ వేంకటేశ్వరుడు భౌతికరూపమైన హంసగా రూపొంది తన దివ్యతత్తాన్ని వెల్లడిస్తాడు. హంస సరస్వతికీ వాహనం. కనుక కల్యాణదేవుడు సరస్వతీరూపంతో వీణాపుస్తకపాణియై దర్శనమివ్వడం జ్ఞానవిజ్ఞానచైతన్య శుద్ధసత్త్వగుణానికి నిదర్శనం. భక్తులు హంసల వలె నిర్మలమనస్కులై ఉంటే, వాళ్ల హృదయాల్లో తాను శాశ్వతంగా అధివసించి ఉంటానని ఈ వాహనం ద్వారా స్వామివారు సెలవిస్తున్నారు.