యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నాలుగు దశాబ్దాల సుధీర్ఘ మైన రాజకీయ చరిత్రలో ఎలాంటి మచ్చ లేని వ్యక్తిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ ప్రస్థానం ఈ ఎన్నికల్లో ఓటమితో దాదాపు ముగిసిపోయింది. విజయనగర రాజవంశీకుల కుటుంబం నుంచి వచ్చిన అశోక్ 1978లో తొలి సారి చట్ట సభలకు పోటీ చేశారు. 1978లో తొలిసారిగా జనతా పార్టీ నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలోకి వచ్చిన అశోక్ గజపతిరాజు 1983 నుంచి 2004 ఎన్నికల వరకు ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2004 ఎన్నికల్లో అశోక్ అత్యంత అవమానకరంగా ఇండిపెండెంట్ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు.కోలగట్ల అంతకు ముందు వరుసగా అశోక్ గజపతిరాజు చేతిలో పోటీ చేసి ఓడిపోతూ వస్తుండడంతో సానుభూతి పవనాలతో ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో గట్టెక్కారు. 2009లో తిరిగి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన గత ఎన్నికల్లో ఎంపీ బరిలో దిగి ఘన విజయం సాధించారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేసిన అశోక్‌కు మోడీ కేబినెట్‌లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదా దక్కింది. మూడేళ్ల పాటు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఎన్డీయే నుంచి టిడిపి బయటకు రావడంతో సహజంగానే తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయనగరం నుంచి సిట్టింగ్ ఎంపీ హోదాలో మరోసారి పోటీ చేశారు. ఇక తన రాజకీయ వారసురాలిగా తన కుమార్తె అదితి గజపతిరాజును విజయనగరం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించారు. రాష్ట్రవ్యాప్తంగా వీచిన ఫ్యాన్ గాలుల ప్రభంజనంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అశోక్ కుమార్తె అదితితో పాటు ఎంపీగా పోటీ చేసిన అశోక్ ఇద్దరు ఓడిపోయారు.అశోక్ కుమార్తె తన పాత రాజకీయ ప్రత్యర్థి అయిన కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోతే అశోక్ రాజకీయంగా ఒక్కసారిగా కూడా గెలవని బెల్లాన చంద్రశేఖర్ చేతిలో 46 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్ వరకు ఎంపీకి వచ్చేసరికి అశోకు క్రాస్ ఓటింగ్ జరిగి మెజారిటీ వచ్చినా… ఎమ్మెల్యేగా మాత్రం ఆయన కుమార్తె అదితి ఓడిపోయారు. వాస్తవంగా జగన్ అశోక్ గజపతిరాజు పై చాలా జూనియర్ అయిన బెల్లాన చంద్రశేఖర్‌ను పోటీ చేయించారు. ఎన్నికల్లో బెల్లాన గెలుస్తాడని వైసీపీ వాళ్లకే చాలా మందికి నమ్మకం లేదు. అయితే విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో బెల్లాన అశోక్‌ను ఢీకొట్టి సంచలన విజయం సాధించి రికార్డులకు ఎక్కారు. ఇప్పటికే అన్ని
పదవులు అనుభవించిన అశోక్ గజపతిరాజుకు వయసు పైబడడంతో ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదు. ఈ ఎన్నికల ప్రచారంలో తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఇప్పటికే ప్రకటించిన ఆయన ఇకపై విశ్రాంతికే పరిమితం కానున్నారు.ఇక తన రాజకీయ వారసురాలిగా అదితిని ఈ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ చేయించినా… ఆమె తొలి ప్రయత్నంలోనే ఓడిపోవడంతో ఇకపై పోరాటాలు చేసి తండ్రి రాజకీయ వారసత్వాన్ని నిలబెడుతుందో లేదో చూడాలి. విజయనగరం జిల్లాలో మారిన రాజకీయ ఈక్వేషన్‌లను బట్టి ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. ఈ జిల్లా ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే కోస్తా, గుంటూరు జిల్లాల్లా కుల ఈక్వేషన్లకు కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఈక్వేషన్‌లను దాటుకుని ఇక్కడ రాజకీయంగా నిలబడాలి అంటే అశోక్ రాజకీయ వారసురాలు శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎలాంటి మరక లేకుండా ఉంటూ అందరి చేత ప్రశంసలు అందుకున్న అశోక్ గజపతిరాజు శకం ముగిసిపోయింది. మరి ఇక ఆయన వారసురాళ్ల రాజకీయ శకం ఎలా ఉంటుందో ? భవిష్యత్ చెప్పాలి.